ఓవైపు నోట్ల రద్దు అనంతరం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లోని ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనం ఇస్తోంటే, అసోంలోని టిన్సుకియా ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎంలో మాత్రం రూ.12.38 లక్షల విలువైన నోట్ల కట్టలు ఎలుకలకు ఆహారంగా మారాయి. టిన్సుకియా లైపులి ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎం పలు సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదని మే 20వ తేదీ నుంచి జూన్ 11 వరకు మూసేశారు. అనంతరం ఏటీఎంకి మరమ్మతులు చేయడానికి వచ్చిన సాంకేతిక సిబ్బంది ఏటీఎం తెరిచి చూసి షాక్ అయ్యారు. అందులో ఉండాల్సిన నగదు కట్టల్ని ఎలుక కొరికేయడం చూసి వారికి నోట మాట రాలేదు.
ఏటీఎం మెషీన్‌లో దూరిన ఎలుకే ఈ పనిచేసిందని భావిస్తున్నారు. దీనిపై టిన్సుకియా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటికీ ఆ విషయం చాలా ఆలస్యంగా బయటికి పొక్కింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఏటీఎం పనిచేయకుండా పోవడానికి ముందుగా ప్రైవేటు సెక్యురిటీ సంస్థ అందులో రూ.29 లక్షలు డిపాజిట్ చేయగా, అందులోంచి ఎలుక రూ.12.38 లక్షల వరకు కొరికేసిందని, మరో రూ.17 లక్షల వరకు తిరిగి స్వాధీనం చేసుకోగలిగాం అని బ్యాంకు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. ఏటీఎంలో నగదు ఎలుక కొరికేసిందనే వార్త ఫోటోలతో యుక్తంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.