బీజేపీకి షాక్! కొత్త పార్టీ పెట్టిన బీజేపీ ఎంపీ

కొత్త పార్టీ పేరు ప్రకటించిన బీజేపీ ఎంపీ

Last Updated : Aug 31, 2018, 02:03 PM IST
బీజేపీకి షాక్! కొత్త పార్టీ పెట్టిన బీజేపీ ఎంపీ

బీజేపీ ఎంపీ రాజ్‌కుమార్ శైనీ ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. హర్యానాలోని ప్రముఖ చారిత్రక నగరం కురుక్షేత్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న రాజ్‌కుమార్ శైనీ.. లోక్‌తంత్ర సురక్ష పేరిట పార్టీని స్థాపిస్తున్నట్టు తేల్చిచెప్పారు. పార్టీ స్థాపన సందర్భంగా సెప్టెంబర్ 2న భారీ ర్యాలీని తలపెట్టినట్టు రాజ్‌కుమార్ శైనీ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో చెప్పారు. ఈమేరకు ఏఎన్ఐ ఓ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 2న చేపట్టనున్న ర్యాలీలోనే పార్టీ జండా, చిహ్నం ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో ఈ బీజేపీ ఎంపీ తన సొంత పార్టీపైనే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 90శాతం మంది ఓటమి చవిచూస్తారని సంచలన వ్యాఖ్యలు చేసి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా ఇప్పటికే తన సొంత నియోజకవర్గమైన కురుక్షేత్ర కేంద్రంగా కేంద్ర సర్కార్‌కి వ్యతిరేకంగా లోక్‌తంత్ర బచావో ( ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అనే ర్యాలీని కూడా చేపట్టారు. దీంతో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయం అనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్‌కుమార్ శైనీ తన కొత్త పార్టీని ప్రకటించడం గమనార్హం. 

 

Trending News