నోట్ల మార్పిడి కష్టాలు: చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకోవు!

చిరిగిపోయిన/పాడైపోయిన రూ.200. రూ.2000 నోట్ల మార్పిడి బ్యాంకర్లకు పెద్ద సమస్యగా మారింది.

Last Updated : May 14, 2018, 06:47 PM IST
నోట్ల మార్పిడి కష్టాలు: చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకోవు!

న్యూఢిల్లీ: చిరిగిపోయిన/పాడైపోయిన రూ.200, రూ.2000 నోట్ల మార్పిడి బ్యాంకర్లకు పెద్ద సమస్యగా మారింది. కొత్త కరెన్సీ నోట్లకు అనుగుణంగా 'నోట్ రిఫండ్' చట్ట నిబంధనల్లో మార్పులు చేపట్టకపోవడంతో వీటి మార్పిడికి అవకాశం లేదు. దీంతో ఎక్స్చేంజి కౌంటర్లలో చిరిగిన నోట్లు భారీగా పేరుకుపోతున్నాయి. ఆర్బీఐ చట్టం ప్రకారం రూ.5, రూ.10, రూ.50, రూ.100, రూ.500, రూ.1,000, రూ.5,000, రూ.10,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లకే ఎక్స్చేంజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.

కానీ డీమానిటైజేషన్ తర్వాత కొత్తగా వచ్చిన రూ.200, రూ.2,000 నోట్లు ఈ జాబితాలో ఇంకా చేర్చలేదని, దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని.. ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని వివిధ బ్యాంకులు ఆర్బీఐని కోరుతున్నాయి. అటు ఈ చట్ట సవరణపై కేంద్రానికి ఇప్పటికే నివేదించామని ఆర్బీఐ తెలిపింది.  

చిరిగిన నోట్లతో దందా

చిరిగిన కొత్త నోట్ల మార్పిడికి బ్యాంకులు నిరాకరిస్తుండటం కమీషన్ ఏజెంట్లకు వరంగా మారింది. రూ.2 వేల చిరిగిన నోటుకి రూ.500.. రూ.500 చిరిగిన నోటుకి రూ.200 వరకు కమీషన్‌గా తీసుకుంటున్నారని రిపోర్టులు తెలిపాయి. అడ్డగోలు కమీషన్‌ కింద చిరిగిన నోట్లను కొందరు మార్చుకుంటుంటే.. మరికొందరు కమీషన్‌ ఇవ్వలేక బ్యాంకులు ఎప్పుడు వీటిని మార్పిడికి అవకాశం ఇస్తాయా..అని వేచి చూస్తున్నారు.

Trending News