Side Effects of Green Tea: గ్రీన్ టీ అంటేనే సహజంగా లభించే ఒక దివ్యమైన ఔషదం అనే పేరు ఉంది. చాలామందిలోనూ ఇలాంటి భావనే ఉంటుంది. కానీ గ్రీన్ టీతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే చాలామందికి గ్రీన్ టీతో వచ్చే లాభాలే తెలుసు కానీ గ్రీన్ టీ కూడా హానీ చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు. ఏంటీ.. కొలెస్ట్రాల్ కరిగించి, అధిక బరువు తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గ్రీన్ టీ తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారా ? ఔను మీరు చదివింది నిజమే. ఇంతకీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి అనేవి తెలియాలంటే మనం మరిన్ని డీటేల్స్ లోకి వెళ్లాల్సిందే.
చాలామందిలో గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది అనే భావన ఉంటుంది కనుక దీనిని ఎంత ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది అనే అపోహ కూడా ఉంటుంది. కానీ వాస్తవానికి గ్రీన్ టీ మోతాదుకు మించి కప్పులకు కప్పులు తాగితే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అది ఆరోగ్యానికి మేలు కంటే చేసే చేటే ఎక్కువ.
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కొంతమందికి కడుపులో మంట రావడంతో పాటు అది అసిడిటి సమస్యకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. గ్రీన్ టీలో ఉండే కంటెంట్స్ శరీరంలో ఐరన్, క్యాల్షియం వంటి ఇతర పోషకాలను గ్రహించడంలో అడ్డుపడతాయి. ఫలితంగా ఎముకలు బలహీనపడే ప్రమాదం లేకపోలేదు.
గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అది శరీరంలో ఐరన్ సంగ్రహించే ప్రక్రియను అడ్డుకుంటుంది. ఇది క్రమక్రమంగా ఐరన్ లోపానికి దారి తీస్తుంది. గ్రీన్ టీలోనూ కెఫైన్ ఉంటుంది. రోజులో ఎక్కువసార్లు గ్రీన్ టీ సేవించడం వల్ల శరీరంలో కెఫైన్ కంటెంట్ ఎక్కువై అది తలనొప్పికి దారితీస్తుంది.
గ్రీన్ టీని అధిక మోతాదులో సేవించడం వల్ల నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది అని హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రీన్ టీని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో అధిక మొత్తంలో చేరే కెఫైన్ మీ మెదడుకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా మోషన్ సిక్నెస్ అనే అనారోగ్య సమస్య తలెత్తుతుంది.
గ్రీన్ టీలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. కళ్లు తిరగడం లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గ్రీన్ టీని ఎక్కువగా సేవిస్తే.. అది మీ కాలేయంపై దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. గ్రీన్ టీ అధికంగా సేవించే వారిలో లివర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.