బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరోమారు తన దయార్ద్ర హృదయం ఎంత గొప్పదో చూపించారు. ముంబయిలోని టాటా మెమోరియల్ ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ చిన్నారి సల్మాన్ ఖాన్‌ను చూడడమే తన చిరకాల కోరిక అని తెలపగా.. ఆ విషయం తెలుసుకున్న ఆయన ఆసుపత్రికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ చిన్నారితో కొంచెం సేపు ముచ్చటించారు. అలాగే అదే ఆసుపత్రిలో వైద్య సహాయం తీసుకుంటున్న ఇతర చిన్నారులను కూడా సల్మాన్ కలిశారు. సల్మాన్ ఆసుపత్రికి వచ్చి క్యాన్సర్ చిన్నారితో ముచ్చటించిన ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్లలో ఆ వీడియో హల్చల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్‌కి పిల్లలంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ఆయన ఇలా చిన్నారులను కలిసి ముచ్చటించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన హిందీలో బిగ్ బాస్ షోకి వ్యాఖ్యతగా వ్యవహరించడంతో పాటు "భారత్" అనే చిత్రంలో నటిస్తున్నారు.
అలాగే "బీయింగ్ హ్యమన్" అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన సల్మాన్.. ఆ సంస్థ తరఫున పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. 2007లో ఆయన ప్రారంభించిన ఆ సంస్థ ద్వారా ముంబయిలోని అక్షర హైస్కూలులో 200 మంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు. అక్షర హైస్కూల్, మాయా ఫౌండేషన్, మారో డోనర్ రిజిస్ట్రీ, ది మాక్స్ ఫౌండేషన్ మొదలైనవి బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్‌కు పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇదే ఫౌండేషన్ ఒక షాపింగ్ వెబ్ సైట్ కూడా నడుపుతోంది. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది.