Puneet Rajkumar Died: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి.. శోకసంద్రంలో అభిమానులు

Puneet Rajkumar Died: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్ (46) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన పునీత్​ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 04:00 PM IST
Puneet Rajkumar Died: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి.. శోకసంద్రంలో అభిమానులు

Puneet Rajkumar Died: ప్రముఖ కన్నడ హీరో, పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ (46) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్‌ ప్రాణాలు దక్కలేదు. పునీత్‌ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీవ్రలోటు అని సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. పునీత్‌ మరణవార్త విని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పునీత్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఏంజరిగిందంటే..!

ఎప్పటిలాగే పునీత్‌ రాజ్‌కుమార్‌ వ్యాయామం చేయడం మొదలు పెట్టారు. ఉదయం 9.30 గంటల సమయంలో వ్యాయామం చేస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో, ఆయన సిబ్బంది వెంటనే దగ్గర్లోని రమణశ్రీ ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్‌ అరెస్ట్‌ అయినట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరొక ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో పునీత్‌ను విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు.

అయితే, పరిస్థితి చేయి దాటిపోయింది. పునీత్‌ తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయాన్ని వెంటనే ప్రకటించలేదు. సమాచారం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, హోం మంత్రి హుటాహుటీన ఆస్పత్రికి చేరుకున్నారు. తర్వాత ఏం చేయాలన్న దానిపై చర్చించారు. పునీత్‌ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. పునీత్‌ అంత్యక్రియలు గురించి ఈ సందర్భంగా చర్చించారు. రాజ్‌కుమార్‌ భౌతిక కాయాన్ని తొలుత ఆయన నివాసానికి అనంతరం అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియానికి తరలించనున్నారు.

కర్ణాటకలో హై అలర్ట్‌

మరోవైపు క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పునీత్‌ మరణవార్త తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు విక్రమ్‌ ఆస్పత్రకి చేరుకున్నారు.

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్‌.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బెట్టడా హువు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకూ ఆయన 32 చిత్రాల్లో నటించారు. ‘వసంత గీత’, ‘భాగ్యవంత’, ‘ఏడు నక్షత్రాలు’, ‘భక్త ప్రహ్లాద’, ‘యరివాను’ వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యువరత్న’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్‌ సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి.

Also Read: Puneeth Rajkumar Health: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News