Petta Movie Review ; పేట సినిమా రివ్యూ

ర‌జనీకాంత్, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్..

Last Updated : Jan 10, 2019, 09:15 PM IST
Petta Movie Review ; పేట సినిమా రివ్యూ

న‌టీన‌టులు: ర‌జనీకాంత్, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్..
ద‌ర్శ‌కుడు: కార్తిక్ సుబ్బ‌రాజ్
నిర్మాత‌: వ‌ల్ల‌భ‌నేని అశోక్
నిర్మాణ సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్
డిఓపి: తిర‌ుణ‌వుక్క‌రుసు
సంగీతం: అనిరుధ్ ర‌విచంద‌ర్
ఎడిట‌ర్: వివేక్ హ‌ర్ష‌న్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సురేష్ సెల్వ‌రాజ‌న్
యాక్ష‌న్ డైరెక్ట‌ర్: పీట‌ర్ హెయిన్
సెన్సార్: U/A
నిడివి: 172 నిమిషాలు
రిలీజ్ డేట్: జనవరి 10, 2019
సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి షార్ట్ గ్యాప్ లో మరో సినిమా వచ్చేసింది. పేటగా కంప్లీట్ మాస్ లుక్ లో రజనీకాంత్ చేసిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరణ మాస్ అంటూ రజనీ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
పేట వీర అలియాస్ కాళి (రజనీకాంత్) ఓ హాస్టల్ వార్డెన్ గా జాయిన్ అవుతాడు. హాస్టల్ లో జరిగే ర్యాగింగ్స్ అరికడుతూ విద్యార్థులకు దగ్గరవుతాడు. అదే కాలేజ్ లో ప్రేమించుకుంటున్న ఓ జంటకు సహాయం చేస్తాడు. దీంతో కాళిపై దాడులు జరుగుతాయి. అయితే ఒక సమయంలో కాళిపై దాడులు మరింత ఎక్కువవుతాయి. ఈసారి దాడిచేసింది పాత గ్యాంగ్ కాదు. ఇంతకీ కాళిపై దాడి చేసింది ఎవరు? గతంలో కాళి ఏం చేసేవాడు? అతడు హాస్టల్ వార్డెన్ గా ఎందుకు జాయిన్ అయ్యాడు? ఫైనల్ గా ఆ ప్రేమజంటను కలిపాడా లేదా అనేది స్టోరీ.
నటీనటుల పనితీరు
రజనీకాంత్ స్టయిల్ మొత్తం ఈ ఒక్క సినిమాలో చూసేయొచ్చు. హెడ్ టర్నింగ్, సిగరెట్ కాల్చడం, స్టయిల్ గా నడవడం, కారు నుంచి దిగడం, దర్జాగా కూర్చోవడం.. ఇలా ఒకటేంటి సూపర్ స్టార్ నుంచి ఆడియన్స్ ఏదైతే ఆశిస్తారో అదంతా పేటలో ఉంది. రజనీకాంత్ భార్యగా నటించిన త్రిష, ప్రేయసిగా కనిపించిన సిమ్రాన్ ఇద్దరూ చిన్న చిన్న పాత్రలకే పరిమితమైపోయారు. కేవలం రజనీకాంత్ సరసన అవకాశం కాబట్టి ఒప్పుకున్నట్టున్నారు. ఇక మేఘా ఆకాష్ ది అతిచిన్న పాత్ర. దాదాపు ట్రయిలర్ లో చూపించినంత మాత్రమే ఉంది.

ఫస్టాఫ్ లో విలన్ గా కనిపించిన బాబి సిన్హా, సెకెండాఫ్ లో నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన విజయ్ సేతుపతి, మొత్తంగా మెయిన్ విలన్ పాత్ర పోషించిన నవజుద్దీన్ సిద్ధిఖి ఆకట్టుకున్నారు. వీళ్ల యాక్టింగ్ లో వంకలు పెట్టడానికేం లేదు.
 

టెక్నీషియన్స్ పనితీరు
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సినిమాల్లో టెక్నికల్ వాల్యూస్ బాగుంటాయి. గత సినిమాలతోనే అది ప్రూవ్ అయింది. పేట సినిమాలో ఈ యాంగిల్ మరింత ఎలివేట్ అయింది. సినిమాటోగ్రఫీ, సంగీతం, సెట్స్, ప్రొడక్షన్ డిజైనింగ్.. చివరికి కాస్ట్యూమ్స్ ఇలా అన్ని విభాగాల్లో పేట ది బెస్ట్ అనిపిస్తుంది. అయితే ఈ లిస్ట్ నుంచి ఎడిటింగ్ ను మాత్రం కట్ చేయాలి. చాలా రోజుల తర్వాత రజనీతో నీట్ గా స్టెప్పులేయించిన షరీఫ్, బాబా భాస్కర్ ను అభినందించాలి.

ఇక దర్శకుడు కార్తీక్ విషయానికొస్తే ఇతడి సినిమాల్లో స్క్రీన్ ప్లే బాగుంటుంది. పేట కూడా అందుకు మినహాయింపు కాదు. పేటలో స్క్రీన్ ప్లే బాగుంది. కానీ చెప్పాల్సిన పాయింట్ ను అటుఇటు తిప్పి చెప్పాలనే తాపత్రయం డైరక్టర్ లో ఎక్కువగా కనిపించింది. ఫలితంగా
అనవసరమైన సన్నివేశాలు సినిమాలో చొరబడ్డాయి.

జీ సినిమాలు రివ్యూ
బాషాలో రజనీకాంత్ స్టయిల్… నరసింహలో రజనీ చెప్పిన పంచ్ డైలాగ్స్.. అరుణాచలంలో సూపర్ స్టార్ కామెడీ టైమింగ్.. ఇవన్నీ కలిపి ఒకే సినిమాలో చూడాలనుకుంటున్నారా? అయితే పేట సినిమా చూస్తే సరిపోతుంది. పైన మనం చెప్పుకున్నవన్నీ ఇందులో ఉన్నాయి. సూపర్ స్టార్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. రజనీ చాన్నాళ్ల తర్వాత తన స్టయిల్ మొత్తాన్ని ఇందులో బయటపెట్టాడు. అతడి మేనరిజమ్స్, స్టయిల్, యాక్టింగ్ మరోసారి ఆకట్టుకుంటాయి. అంతకుమించి పేట నుంచి ఇంకేం ఆశించకూడదు.

డిఫరెంట్ సినిమాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు, పేట విషయానికొచ్చేసరికి రజనీకాంత్ మాయలో పడిపోయాడు. తన స్టయిల్ ను పూర్తిగా వదిలేశాడు. దర్శకత్వం, స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడ మెరుపులు ఉన్నప్పటికీ అవి సరిపోవు. మరీ ముఖ్యంగా టప్ కాంపిటిషన్ ఉన్న బాక్సాఫీస్ వద్ద పేటను అవి కాపాడలేవు.

కథ చెబుతున్నాననే భ్రమలో దర్శకుడు అనవసరమైన చాలా విషయాల్ని చెప్పేశాడు. ముఖ్యంగా సిమ్రాన్ ఎపిసోడ్. సిమ్రాన్ ట్రాక్ మొత్తాన్ని తీసి పక్కనపెట్టొచ్చు. రజనీకాంత్ అద్భుతమైన ఎంట్రీతో కథను స్టార్ట్ చేసిన దర్శకుడు.. మూవీలో ట్విస్టులు బాగానే ఇచ్చాడు. కానీ ఈ క్రమంలో కథను సాగదీసి విసిగించాడు. ఇంటర్వెల్ కు ముందే 3 గంటల సినిమా చూసిన అనుభూతి. ఇక ఇంటర్వెల్ తర్వాత మరో 3 గంటలు సినిమా చూసిన అనుభూతి. వెరసి పేట సినిమా సహనానికి పరీక్షగా నిలుస్తుంది.

క్లైమాక్స్ లో విజయ్ సేతుపతికి రజనీకాంత్ చెప్పిన రామాయణం కథ పెద్ద ట్విస్ట్ అవుతుందని దర్శకుడు భావించాడు. కానీ ఆ ట్విస్ట్ కాస్తా చిరాకు తెప్పించింది. అప్పటికే 3 గంటల సినిమా చూసిన ప్రేక్షకుడికి ఆ “రామాయణం కథ” బోర్ కొట్టిస్తుంది. అప్పటివరకు రజనీకాంత్ అందించిన రసానుభూతి మొత్తం హరించిపోతుంది.

ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకున్న విషయాలు సినిమాటోగ్రఫీ, సంగీతం మాత్రమే. తిరు సినిమాటోగ్రఫీ అద్భుతం. 3 గంటల సినిమాను భరించగలిగేలా చేసింది ఇతడి కెమెరా పనితనం, లైటింగ్ మాత్రమే. దీనికి అనిరుధ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ అవ్వడంతో పేట సినిమా ఫరవాలేదనిపిస్తుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తీసిన ఎలివేషన్ షాట్స్, ట్విస్టులు, సినిమాటోగ్రఫీ, సంగీతం, రజనీకాంత్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ పేటలో హైలెట్స్. ఇక విసిగించే సిమ్రాన్ ఎపిసోడ్, సాగదీసిన సన్నివేశాలు, 3 గంటల రన్ టైమ్ సినిమాను వెనక్కిలాగే పాయింట్స్.

ఓవరాల్ గా రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రం పేట సినిమాతో ఈ సంక్రాంతిని సంబరంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
రేటింగ్ 2.5/5

Trending News