టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా "భరత్ అనే నేను". ఇప్పటికే ఇండియాలో రూ.125 కోట్లు కలెక్షన్లు (ఓవర్సీస్తో కలుపుకుంటే రూ.161.28 కోట్లు) కొల్లగొట్టిన ఈ చిత్రంపై ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. "ఈ చిత్రం నాకు నిజంగానే మంచి అనుభూతిని మిగిల్చింది. భరత్ లాంటి పాత్రను నా చేత చేయించినందుకు కొరటాల శివకు ధన్యవాదాలు. అయితే ఈ పాత్రను తీర్చిదిద్దడం ఒక ఎత్తైతే.. దానిని ఆడియన్స్ లైక్ చేయడం మరో ఎత్తు. ఈ సినిమా అందరికీ నచ్చినందుకు మా యూనిట్‌కు సంతోషంగా ఉంది.
ఇది నేను గర్వపడే విషయం. నిజం చెప్పాలంటే ఈ సినిమా కథ చాలా పెద్దది. కేవలం రెండున్నర గంటల్లో చూపించడం అనేది కత్తి మీద సాము లాంటి పని. కానీ దర్శకుడు అందులో సక్సెస్ అయ్యాడు. ఒక వేళ శివ ఒప్పుకుంటే మళ్లీ ఈ సినిమా సీక్వెల్ చేయడానికికైనా నేను రెడీనే" అన్నారు మహేష్ బాబు
"భరత్ అనే నేను" చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రవాసంలో చదువుకున్న ఓ తెలుగు యువకుడు ఎలాంటి అనుభవం లేకుండా.. దేశ పరిస్థితుల మీద అవగాహన లేకుండా సీఎం అయ్యాక ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి? రాజకీయ కుటిలనీతిని తట్టుకొని ఎలా నిలబడ్డాడు? లాంటి అంశాలను ఈ చిత్రంలో దర్శకుడు చాలా చక్కగా ఆవిష్కరించారని ఇప్పటికే అనేక సమీక్షలు వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ సీక్వెల్ గురించి మహేష్ మాట్లాడారంటే.. అది నిజమవుతుందో లేదో కూడా వేచి చూడాల్సిందే..!