హైదరాబాద్: టాలీవుడ్ హీరో రాజశేఖర్ రాజీనామాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆమోదించింది. గత గురువారం ఓ హోటల్లో డైరీల ఆవిష్కరణ సందర్భంగా ‘మా’లో విభేదాలు భగుమన్నాయి. తనకు తగిన గుర్తింపు రాలేదని వ్యాఖ్యానించడం, ఆ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. రాజశేఖర్ ఆయన చేతిలోంచి మైక్ లాక్కోవడం వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబు సహా మరికొందరు సినీ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
నేడు (జనవరి 5) జరిగిన కార్యనిర్వాహక కమిటీ సభ్యుల సమావేశంలో ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ చేసిన రాజీనామా లేఖను ఆమోదించారు. క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నత స్థాయి కమిటీని సైతం ఎగ్జిక్యూటివ్ సభ్యులు నియమించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్‌బాబు, చిరంజీవి, జయసుధలతో ఓ కమిటీ వేశారు. అనంతరం రాజశేఖర్ రాజీనామా ఆమోదంతో పాటు కమిటీ ఏర్పాటు వివరాలను ‘మా’ వెల్లడించింది.
తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేష్ కారణమని, కొత్త కార్యవర్గం ఏర్పడినప్పటి నుంచీ ఆయన తీరు బాగోలేదని రాజశేఖర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. డైరీల ఆవిష్కరణ జరుగుతుండగా వేదిక మీద కూర్చున్న చిరంజీవి, మోహన్‌బాబుల కాళ్లు మొక్కి రాజశేఖర్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనిపై చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గొడవ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమానికి వచ్చారని రాజశేఖర్ తీరును ప్రస్తావించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు, మోహన్‌బాబు సైతం చిరంజీవికి మద్దతుగా నిలవడం రాజశేఖర్‌ను మరింతగా బాధించి ఉండొచ్చు. రాజశేఖర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..