రెండు నెలల పాటు హోరాహోరీగా జరిగిన ఐపీఎల్ సంబరానికి నేడు తెరపడనుంది. టోర్నీలో లీగ్ దశలో తొలి రెండు స్థానాలలో ఉన్న హైదరాబాద్, చెన్నై జట్లు నేడు ఫైనల్లో తలపడనున్నాయి. లీగ్ దశలో పాయింట్ల పట్టికలలో తొలి స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది. అయితే క్వాలిఫైయర్-2లో కోల్‌కతాపై గెలిచి రెట్టించిన ఉత్సాహంతో తుదిపోరుకు సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ సాయంత్రం 7 గంటలకు ముంబై వాంఖడే స్టేడియంలో పైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఐపీఎల్ 11వ సీజన్ ఫైనల్ పోరు కోసం హైదరాబాద్-చెన్నై జట్లు మరికొద్ది గంటల్లో సిద్ధం అవుతుండగా.. ఇరు జట్ల అభిమానులు ట్విట్టర్‌లో తమదైన శైలిలో మద్దతు తెలుపుతున్నారు. కొందరు ఇది బిర్యాని వర్సెస్ సాంబార్ మధ్య పోరాటమని వెరైటీ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం (ఇండియా సిమెంట్స్), సన్ రైజర్స్ హైదరాబాద్ (సన్ గ్రూప్) యాజమాన్యం రెండూ చెన్నైకి చెందినవే..!