ఫేస్‌బుక్ తన ట్రెండింగ్ న్యూస్ ఫీచర్‌కు గుడ్‌బై చెప్పనుంది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కొనసాగించిన ట్రెండింగ్ ట్యాబ్‌ను ఫేస్‌బుక్ తొలగిస్తోంది. ఈ ట్యాబ్ ప్రస్తుతం కాలం చెల్లినది కావడంతో తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ట్రెండింగ్ న్యూస్ ఫీచర్ ఫేస్‌బుక్‌కు అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలోని ఈ అంశం ఆధారంగా అనేక అంశాలు ప్రభావితం కావడంతో పాటు రాజకీయ అసమతుల్యత, డబ్బులిస్తే మార్చేయగలగడం సహా ఫేక్ న్యూస్ పెరిగేందుకు కారణమైంది. దీంతో ఈ ఫీచర్‌ను తొలగించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న, చర్చిస్తున్న వార్తాంశాలను తన వినియోగదారులకు అందించే ఉద్దేశంతో 2014లో ఫేస్‌బుక్ ట్రెండింగ్ న్యూస్‌ను ప్రవేశపెట్టింది. ట్విట్టర్‌కు గట్టి పోటీనిచ్చేందుకు అప్పట్లో ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. కాగా ట్రెండింగ్ న్యూస్ ట్యాబ్ స్థానంలో బ్రేకింగ్ న్యూస్ ట్యాబ్ త్వరలోనే వస్తుందట. ఇందులో ప్రాంతీయ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఫేస్‌బుక్ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.