బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్, నిర్మాత బోనీ కపూర్‌కి క్షమాపణలు చెప్పారు. తాను దాదాపు 25 సంవత్సరాల క్రితం నటి శ్రీదేవికి ఫ్లాప్ సినిమా ఇచ్చానని ఆయన బాధపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో తన ఆలోచనలను పంచుకున్నారు.
" 25 సంవత్సరాల క్రితం నేను "రూప్ కీ రాణీ.. చోరోంకా రాజా" అనే చిత్రానికి దర్శకత్వం వహించాను. అది నా మొదటి చిత్రం.. అంటే నాకు మొదటి బిడ్డ లాంటిది. నా హృదయానికి చాలా దగ్గరైన చిత్రం. కానీ ఫ్లాపైంది. అందులో నటించిన శ్రీదేవి గారిని గుర్తు చేసుకుంటూనే.. ఆ చిత్ర నిర్మాత బోనీ కపూర్‌కి క్షమాపణలు చెబుతున్నాను. నాకు బ్రేక్ ఇవ్వాలని బోనీ ఆ చిత్రం నాకిస్తే.. అదే మా మధ్య బంధాన్ని బ్రేక్ చేసింది" అని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌కి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఆ రోజుల్లో అంత సాంకేతికంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించడం గొప్ప విషయం అని కొందరు పేర్కొన్నారు.
1993లో వచ్చిన "రూప్ కీ రాణీ.. చోరోంకా రాజా" చిత్రాన్ని దాదాపు 9 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి జావేద్ అక్తర్ కథను అందించారు. తొలుత శేఖర్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించినా... తర్వాత ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన సతీష్ కౌశిక్ సినిమాని పూర్తి చేశారు.
ఈ చిత్రంలో అనిల్ కపూర్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించగా.. జాకీష్రాఫ్, పరేష్ రావేల్, ఆకాష్ ఖురానా, జానీ లీవర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడమే కాకుండా.. నిర్మాతకు భారీ నష్టాలను సైతం తీసుకొచ్చింది.
Yes 25 yrs ago it was a disaster at BO bt it was my first child & will remain close to heart. Remembering madam #SrideviLivesForever & my sorry 2 @BoneyKapoor who gave me a break bt was broke after d film.celebrating #25yearsof RKRCKR @AnilKapoor @Javedakhtarjadu @AnupamPKher pic.twitter.com/mXoogmQha5
— satish kaushik (@satishkaushik2) April 16, 2018