మనకు తెలియని ఎన్నో విషయాలను పుస్తకాలు చదివి తెలుసుకోవచ్చు. "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నారు కాబట్టి.. మన ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు తెలియని అంశాలను పలు వైద్య సంబంధిత పుస్తకాలను చదివి.. అందులోని విషయాలను తెలుసుకోవచ్చు. మన ఆలోచనా పరిధిని పెంచుకోవడానికి.. ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచుకోవడానికి ఈ పుస్తకాలను మీరూ చదివేయండి.
ఆహారవేదం: ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణుడు డాక్టర్ జివి పూర్ణచందు గారి కలం నుండి జాలువారిన "ఆహారవేదం" పుస్తకంలో ప్రాచీన వంటకాల్లోని ఆరోగ్య విలువలు, వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారం, ఎలాంటి ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలి, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో మనం మార్చుకోవలసిన వంటకాల తీరు, మందుల అవసరాలు తగ్గించే ఆహారం లాంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించారు. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ ఈ పుస్తకం లభిస్తుంది.
ఆహారం-ఆరోగ్యం: పౌష్టికాహారమే పరమౌషధం అనే సత్యాన్ని ప్రచారం చేస్తూ.. ప్రజలలో మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఈ పుస్తకం చెబుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా ఈ పుస్తకంలో తెలియజేశారు రచయితలు.
యోగా, వ్యాయామం మరియు ఆరోగ్య విద్య: తెలుగు అకాడమీ వారు ప్రచురించిన ఈ పుస్తకం డీఈడీ, బీఈడీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు చేసే విద్యార్థుల కోసం రూపొందించారు.అయితే ఈ పుస్తకాన్ని విద్యార్థులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా చదవాల్సిన అవసరం ఎంతో ఉంది. వ్యాయామాన్ని ఎలా చేయాలో... అందులో ఎలాంటి పద్ధతులు ఉన్నాయో.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి సగటు మనిషిగా చేయాల్సిన పనులేమిటో కూడా ఇందులో బాగా వివరించారు.
ఇంటింటి వైద్యం: ముత్తేవి రవీంద్రనాథ్ కలం నుండి జాలువారిన ఈ పుస్తకంలో ఇంటింటి వైద్య చిట్కాలు చాలా సులభమైన శైలిలో చెప్పడానికి ప్రయత్నించారు. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు లాంటి వాటితో ఇంటిలోనే పలు రుగ్మతలకు వైద్యం చేసుకోవడం ఎలా అన్నది ఈ పుస్తకంలో తెలిపారు.