దుబాయ్‌లో గుండెపోటుతో మృతిచెందిన బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కి తీసుకురావడం కోసం ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. జుమెరియా ఎమిరేట్స్ హోటల్లో గుండెపోటుతో స్పృహ తప్పిపడిపోయిన శ్రీదేవిని ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీదేవి భౌతికకాయం దుబాయ్‌లోని అల్ఖసిస్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో వుంది. రిపబ్లిక్వరల్డ్.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కి తీసుకొచ్చేందుకు ముంబై నుంచి ప్రముఖ వ్యాపారవేత్త, బోనీకపూర్- శ్రీదేవిల సన్నిహితమిత్రుడు అయిన అనిల్ అంబానికి చెందిన ప్రైవేట్ జెట్ దుబాయ్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. ముంబై నుంచి దుబాయ్ వెళ్లి, అక్కడ శ్రీదేవి భౌతికకాయంతో అనిల్ అంబాని ప్రైవేట్ జెట్ నేటి అర్థరాత్రికి ముంబైకి చేరుకుంటుందని సమాచారం.
దుబాయ్‌లో వున్న శ్రీదేవి భర్త, ఆమె కూతురు ఖుషీ కపూర్లతో తాము సంప్రదింపులు జరుపుతున్నాం అని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం అని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ప్రకటించింది. ఈ విషయంలో ఎప్పటికప్పుడు స్థానిక అధికార యంత్రాగంతోనూ తాము సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత హై కమిషనర్ తెలిపారు.