Hanuman Movie Review: హనుమాన్ మూవీ రివ్యూ.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం

Hanuman Movie Review and Rating: భారీ అంచనాల నడుమ తేజ సజ్జా 'హనుమాన్‌' మూవీ ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన ఈ సినిమా బోణీ కొట్టిందా..? అభిమానుల అంచనాలను అందుకుందా..? రివ్యూలో తెలుసుకుందాం..  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 11, 2024, 11:42 PM IST
Hanuman Movie Review: హనుమాన్ మూవీ రివ్యూ.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం

Hanuman Movie Review and Rating: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జా.. హీరోగా ఇప్పటికే పలు సూపర్ హిట్ మూవీస్‌తో ఆకట్టుకున్నాడు. తొలిసారి పాన్‌ ఇండియా మూవీ 'హనుమాన్'తో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాంగ్స్, టీజర్, ట్రైలర్‌తో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెటేషన్స్‌ పెరిగిపోయాయి. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉన్నా.. గట్టిగానే ప్రమోషన్స్ చేసి థియేటర్లలోకి తీసుకువచ్చారు మేకర్స్. మరి అందరి అంచనాలను హనుమాన్ అందుకుందా..? సంక్రాంత్రి రేసులో తేజ సజ్జా హిట్ కొట్టేశాడా..? అనేది రివ్యూలో చూద్దాం.. 

కథ ఏంటంటే..?
 
తన చిన్ననాటి నుంచి సూపర్ హీరో అవ్వాలని మైఖేల్ (వినయ్ వర్మ) అనే కుర్రోడు కలలు కంటుంటాడు. అడ్డు చెప్పిన తల్లిదండ్రులను కూడా హతమారుస్తాడు. మరోవైపు అంజనాద్రి అనే ఊరులో హన్మంతు (తేజ సజ్జా) ఉంటాడు. హన్మంతు చిల్లర దొంగతనాలు చేసుకుంటూ.. అక్క అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)తో కలిసి ఉంటాడు. మీనాక్షి (అమృతా అయ్యర్) అంటే చిన్నతనం నుంచే హన్మంతుకు పిచ్చి ప్రేమ. అయితే తన ప్రేమ విషయం మాత్రం ఎప్పుడు చెప్పడు. 

అంజనాద్రి గ్రామంలో పాలేగాళ్ల గజపతితే రాజ్యం. ఆ గ్రామంలో ఎదురు తిరిగిన వారిని మల్ల యుద్ధంలో గజపతి చంపేస్తుంటాడు. ఈ క్రమంలో గజపతిని ఎదురిస్తుంది మీనాక్షి. ఆమెను కాపాడేందుకు వెళ్లిన హన్మంతు.. నదిలో పడిపోతాడు. నదిలో హన్మంతుకు రుధిర మణి లభిస్తుంది. ఆ రుధిర మణితో హన్మంతుకు సూపర్ పవర్స్ వస్తాయి. ఆ పవర్స్‌తో హన్మంతు ఏం చేశాడు..? పాలెగాళ్ల గజపతి నుంచి తన ఊరిని కాపాడుకున్నాడా..? అంజనాద్రి గ్రామంపై సూపర్ హీరో కావాలనుకున్న మైఖేల్ కన్ను ఎలా పడింది..? హన్మంతు వద్ద ఉన్న సూపర్ పవర్స్‌ దక్కించుకునేందుకు అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు..? ఈ స్టోరీలో సముద్రఖని పాత్ర ఏమిటి..? చివరకు రుధిర మణి ఎక్కడికి చేరుతుంది..? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే హనుమాన్ మూవీని చూడాల్సిందే. 

ఓ సామాన్య వ్యక్తికి సూపర్ పవర్స్ రావడం.. ఆ పవర్స్‌తో అనేక రకాల విన్యాసాలు చేయడం మనం ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తాం. ఈ అతీంద్రయ శక్తులకు మూలం మన పురాణ ఇతిహాసాలే. మన పురాణాల్లోనే సూపర్ పవర్స్‌ ఉన్న ఎన్నో పాత్రలు ఉన్నాయి. అయితే మన మేకర్స్ అలాంటి కాన్సెప్టులపై పెద్దగా సినిమాలు తెరకెక్కించే సాహసం చేయరు. అలాంటి ఓ డేరింగ్ కాన్సెప్ట్‌నే తన కథగా ఎంచుకున్నాడు ప్రశాంత్ వర్మ. 

రామాయణంలో అందరకీ ఇష్టమైన హీరో ఆంజనేయుడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్లకు ఆంజనేయుడి సాహాసాలకు మంత్రముగ్దులు అవుతారు. అలాంటి ఆంజనేయుడిపై ఈ తరంలో మూవీ అంటే.. సహజంగానే అందరిలోనూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇలాంటి సూపర్ పవర్స్ ఉన్న సినిమాలంటే చూసేందుకు ఎగబడతారు. సినిమా ప్రారంభం ఇంట్రెస్టింగ్‌గా మొదలైనా.. ఆ తరువాత కాస్త డల్‌ అనిపిస్తుంది. అయితే హీరోకు సూపర్ పవర్స్ వచ్చిన తరువాత ఒక్కసారిగా బండి పట్టాలెక్కుతుంది.

సూపర్ పవర్స్‌తో తేజ సజ్జా చేసిన విన్యాసాలు చిన్న పిల్లలను భలే ఆకట్టుకుంటాయి. సత్య, గెటప్ శ్రీనుల ఆహార్యం, కామెడీ ఫస్టాఫ్‌లో సినిమాకు ప్లస్‌గా మారాయి. అయితే ఇంటర్వెల్‌కు సమస్యతో స్టార్ట్ అవుతుంది. ద్వితీయార్థంలో ఎలివేషన్ సీన్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. పెద్ద బండను అవలీలగా ఎత్తడం వంటి సీన్లు తెగ నచ్చేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్ ఆడియన్స్‌ చేత కంటతడి పెట్టిస్తుంది. ఎమోషనల్ సాంగ్‌తో కాస్త డల్ అయినా.. ఆ తరువాత వచ్చే సీన్లు, సముద్రఖని చెప్పే డైలాగ్స్‌తో థియేటర్లు మార్మోగిపోతాయి. సౌత్ ఆడియన్స్‌తో పాటు నార్త్‌ ఆడియన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ వర్మ 'హనుమాన్‌'ను తెరకెక్కించాడు. ఆఖర్లో ఆంజనేయుడు రాక ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది.  

సినిమా చూసిన ఆడియన్స్‌ కచ్చితంగా ఆదిపురుష్ మూవీతో పోల్చుకుంటారు. ఆదిపురుష్‌కు వందల కోట్లు ఖర్చు పెట్టినా.. హనుమాన్ మూవీ అంత క్వాలిటీ లేదని కచ్చితంగా అంటారు. తక్కువ బడ్జెట్‌లో ప్రశాంత్ వర్మ ఇంత మంచి అవుట్‌ పుట్ తీసుకువచ్చాడా..? కచ్చితంగా ఆశ్చర్యపోతారు. విజువల్స్‌ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళతాయి. ఇక ఆర్ఆర్ అదిరిపోయేలా ఉంటుంది. హనుమాన్ సాంగ్‌కు ఆడియన్స్‌ రోమాలు కచ్చితంగా నిక్కబొడుచుకుంటాయి.  

ఎవరు ఎలా నటించారు..?

మూవీ చూస్తున్నంతసేపు హన్మంతు పాత్రలో తేజ సజ్జాను తప్ప మరోకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం. వంద శాతం అతనే కరెక్ట్ అనిపిస్తుంది. తేజను దృష్టిలో పెట్టుకునే ప్రశాంత్ వర్మ ఈ కథ రాసుకున్నట్లు అనిపిస్తుంది. తన పాత్రకు మరింత న్యాయం చేకూరుస్తూ ప్రాణం పెట్టి నటించాడు తేజ సజ్జా. ఈ మూవీతో కచ్చితంగా పాన్ ఇండియా వైడ్‌గా ఈ యంగ్ హీరో పేరు మార్మోగిపోవడం ఖాయం. ఇక సినిమాలో సముద్రఖని క్యారెక్టర్‌ ఊహించని రీతిలో ఉంటుంది. ఆ సస్పెన్స్‌ థియేటర్లలో చూస్తే ఫుల్‌ కిక్ వస్తుంది. హీరోయిన్ మీనాక్షి తెరపై చాలా అందంగా కనిపించింది. వరలక్ష్మీ స్థాయికి ఓ అదిరిపోయే సీన్ పడింది. విలన్‌గా వినయ్‌ వర్మ పర్వాలేదనపించినా.. ఇంకాస్త బెటర్‌గా పర్ఫామెన్స్ ఇవ్వొచ్చు. పాలెగాడి పాత్రలో గజపతి భయపెట్టగా.. గెటప్ శ్రీను, సత్య, రోహిణి నవ్వులు పూయిస్తారు. వెన్నెల కిషోర్‌కు కూడా కీరోల్ దక్కింది. మూవీలో ప్రతీ పాత్ర ఆడియన్స్‌ను మెప్పించేలా ఉంటుంది. ఈ సంక్రాంతి బరిలో ముందు దూకిన 'హనుమాన్‌' మూవీ సూపర్ హిట్‌గా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

రేటింగ్: 3.5/5

 

Trending News