ఆఫీసర్ మూవీ రివ్యూ

ఆఫీసర్ మూవీ రివ్యూ

Last Updated : Jun 2, 2018, 12:57 PM IST
ఆఫీసర్ మూవీ రివ్యూ

నటీనటులు : నాగార్జున, మైరా సరీన్, ఫెరోజ్ అబ్బాసి, బేబీ కావ్య , అజయ్ తదితరులు.
ఛాయాగ్రహణం : భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స
సంగీతం : రవి శంకర్
నిర్మాతలు : రామ్ గోపాల్ వర్మ , సుదీర్ చంద్ర
నిర్మాణం : కంపనీ నిర్మాణం
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
రిలీజ్ డేట్ : జూన్ 1, 2018
సెన్సార్ : U/A

నాగార్జున -రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘ఆఫీసర్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాతికేళ్ల తర్వాత సెట్ అయిన ఈ కాంబో ప్రేక్షకులను మెప్పించిందా..? ఆఫీసర్ హిట్ అనిపించుకున్నాడా …? జీ సినిమాలు ఎక్స్‌క్లూజీవ్ రివ్యూ.
 

కథ :
ముంబైలో ప‌సారి నారాయణ్ అనే పోలీస్ ఆఫీస‌ర్ ఓ కేస్‌లో ఇరుక్కుంటాడు.. ఆ కేస్‌ను స్ట‌డీ చేయ‌డానికి హైద‌రాబాద్ నుంచి శివాజీ రావ్ (నాగార్జున)ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమిస్తుంది హై కోర్ట్. అలా ముంబై వెళ్ళిన శివాజీ.. అండ‌ర్ వ‌రల్డ్‌తో ప‌సారి చేతులు క‌లిపి అక్రమాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. కానీ స‌రైన సాక్ష్యాలు లేక ప‌సారిని వ‌దిలేస్తుంది కోర్ట్. ఆ త‌ర్వాత అదే మాఫియాతో లింకులు పెట్టుకున్నాడంటూ శివాజీపై నిందవేస్తారు. దాన్నుంచి శివాజీ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు ? చివరికి పసారిని ఎలా అంతమొందించాడు అనేది మిగతా క‌థ‌.
 
నటీనటుల పనితీరు :
ఇప్పటికే గతంలో కొన్ని పోలిస్ క్యారెక్టర్స్‌తో ఎంటర్‌టైన్ చేసిన నాగార్జున మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా మెస్మరైజ్ చేసాడు. ఇక మైరా సరీన్ తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్లస్ అయ్యింది. ఫెరోజ్ అబ్బాసి కేవలం వర్మ విలన్‌లా మాత్రమే కనిపించాడు తప్ప తన విలనిజంతో ఆకట్టుకోలేకపోయాడు. బేబీ కావ్య తన నటనతో ఆకట్టుకుంది. ఇక షయాజీ షిండే, అజయ్ తదితరులు నిమిత్త పాత్రలుగా మిగిలిపోయారే తప్ప  సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదు.
 
టెక్నిషియన్స్ పనితీరు :
తన ప్రతీ సినిమాకు టెక్నికల్‌గా ఏదో ఒక ప్రయోగం చేసే వర్మ ఎప్పటిలాగే ఈసారి కూడా పలు ప్రయోగాలు చేశాడు. ముఖ్యంగా సరికొత్త సౌండ్ సిస్టం అంటూ మేజిక్ చేద్దామనుకున్నాడు. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ…మ్యూజిక్…ఎడిటింగ్ ఇలా అన్నీ వర్మ రెగ్యులర్ ఫార్మేట్‌లోనే ఉంటూ రొటీన్ అనిపించాయి. వర్మ కథ- స్క్రీన్ ప్లే కూడా రొటీన్‌గానే అనిపిస్తూ బోర్ కొట్టించాయి. కంపనీ ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా కనిపించలేదు.

నాగార్జున -వర్మ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘శివ’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ వచ్చిన తెలుగు సినిమాల్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నాగ్-వర్మ కలిసి చేసిన ‘గోవిందా గోవిందా’, ‘అంతం’ సినిమాలు ఆస్థాయి మేజిక్ రిపీట్ చేయలేక బోల్తా కొట్టాయి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అయినా ఆ మేజిక్ రిపీట్ చేస్తుందని ఎదురుచూసిన అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురైంది.

ప్రారంభం నుండే పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయిన ఈ సినిమా ప్రేక్షకులను కనీసం కొంత మేరకూ అయినా ఎంటర్‌టైన్  చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో అయినా ఊపందుకుంటుందేమో అనుకుంటే మళ్ళీ అవే సాదా సీదా సీన్స్‌తో బోర్ కొట్టించింది. ఒకానొక సమయంలో అసలు ఈ టైంలో నాగ్ ఈ సినిమా చేయడం అవసరమా..? అనే సందేహం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది.

ఇక ఓపెనింగ్ రోజు తనలో జ్యూస్ అయిపోలేదని అది ఈ సినిమాతో నిరుపిస్తానని చెప్పుకొచ్చిన వర్మ ఎప్పటిలాగే ఆ మాటను గాలికొదిలేసాడు. స్టార్టింగ్ నుండే సినిమా ఏదో అలా సాగడం.. గ్రాఫ్ పెంచే సీన్ ఒక్కటీ లేకపోవడం, తండ్రి-కూతుళ్ళ మధ్య ఎమోషన్ పండకపోవడం, కొన్ని సందర్భాల్లో చిరాకు తెప్పించే సీన్స్ సినిమాకు పెద్ద మైనస్.
 
ప్లస్ పాయింట్స్ :
నాగార్జున
సినిమాటోగ్రఫీ
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
మైరా సరీన్ గ్లామర్

మైనస్ పాయింట్స్ :
కథ -స్క్రీన్ ప్లే
విలన్
బలమైన సీన్స్ లేకపోవడం
డ్రాగ్ అనిపించే సెకండ్ హాఫ్
ప్రీ క్లైమాక్స్ – క్లైమాక్స్ ఎపిసోడ్స్

రేటింగ్ : 2 / 5

జీ సినిమాలు సౌజన్యంతో...

Trending News