నేను చనిపోలేదు.. బతికే వున్నానన్న 'చంద్రముఖి' డైరెక్టర్

Last Updated : Jan 16, 2018, 07:46 PM IST
నేను చనిపోలేదు.. బతికే వున్నానన్న 'చంద్రముఖి' డైరెక్టర్

దక్షిణాదిన అగ్ర దర్శకులలో ఒకరైన పి వాసు ఇక లేరని, ఆయన అనారోగ్యంతో మృతిచెందారని మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఇది నిజమే అని నమ్మిన పి వాసు అభిమానులు ఆయనకు నివాళి అర్పిస్తూ పలు పోస్టులు పెట్టడం కూడా జరిగిపోయింది. అలా సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వైరల్ అవుతున్న పి వాసు మృతి వార్త అతడి వరకూ చేరింది. తాను చనిపోయాననే వార్త వాట్సాప్‌లో తనకే చేరడం చూసి నవ్వుకున్నానంటున్న డైరెక్టర్.. తాను చనిపోలేదని, ఇంకా బతికే వున్నానని స్పష్టంచేశారు. ఓ వీడియో ద్వారా అభిమానుల ముందుకొచ్చిన పి వాసు.. తన మృతిపై వస్తున్న వదంతుల్ని కొట్టిపారేశారు.

ఉదయం 6 కిలోమీటర్లు వాకింగ్ చేసి జిమ్‌కి వెళ్లి అప్పుడే ఇంటికి చేరుకున్న తనకు వాట్సాప్‌లో ఓ మెస్సేజ్ వచ్చింది. "డైరెక్టర్ పి వాసు ఇక లేరు" అనేది ఆ మెస్సేజ్ సందేశం. అది చూసి నవ్వాపుకోలేకపోయాను. "తనకి ఏమీ కాలేదు. పూర్తి ఆరోగ్యంగా, నిక్షేపంగా వున్నాను" అని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్. అంతేకాకుండా ఈ ఏడాది తాను మూడు సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాను అని స్పష్టంచేశారు. 

 

తమిళం, తెలుగు, కన్న, మళయాళం భాషల్లో సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్‌గా పి వాసుకి మంచి పేరుంది. పలు సినిమాల్లో నటుడిగాను నిరూపించుకున్న పి వాసు 1999లో హిందీలో "హోగీ ప్యార్ కే జీత్" అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. రజినీకాంత్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చంద్రముఖి సినిమాని డైరెక్ట్ చేసింది పి వాసునే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Trending News