Twitter Office Building Rent: సింగపూర్‌లో ట్విటర్ సంస్థ ఉద్యోగులకు గురువారం ఓ చేదు అనుభవం ఎదురైంది. ట్విటర్ ఆఫీస్ బిల్డింగ్ రెంట్ చెల్లించలేదనే కారణంతో ఆ బిల్డింగ్ యజమాని అందులో పనిచేస్తోన్న సిబ్బందిని బయటికి గెంటేశారు. ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ సింగపూర్‌లోని ట్విటర్ ప్రధాన కార్యాలయం భవంతిని ఉపయోగించుకుంటున్నందుకు చెల్లించాల్సిన నెలవారి అద్దెను చెల్లించడంలో విఫలమవడంతో ఆ బిల్డింగ్ యజమాని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం తమ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా ఓ కీలకమైన సమాచారం అందించాడు. సింగపూర్‌లోని క్యాపిటా గ్రీన్ బిల్డింగ్‌లో పనిచేస్తున్న సిబ్బంది రేపటి నుంచి కార్యాలయానికి రావొద్దని.. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలని ఎలాన్ మస్క్ ట్విటర్ సిబ్బందికి సూచించాడు. ఈ మేరకు కంపెనీ సిబ్బందికి ఈమెయిల్ కూడా వచ్చింది.
ఆసియా - ఫసిపిక్ ప్రాంతానికి ట్విటర్ హెడ్ క్వార్టర్స్ సింగపూర్‌లో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ కార్యాలయానికి సంబందించిన రెంట్ పే చేయడంలోనూ ఎలాన్ మస్క్ చేతులెత్తేశాడు. దీంతో ఎలాన్ మస్క్ అద్దె ఎగ్గొట్టిన నేరం కింద కేసు నమోదైంది. ఇటీవలి కాలంలో ట్విటర్ లాంటి టెక్ దిగ్గజం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే ప్రథమం కావొచ్చు అంటున్నాయి కార్పొరేట్ వర్గాలు.
రెండు చార్టర్డ్ ఫ్లైట్స్ సేవలు ఉపయోగించుకున్న ట్విటర్.. ఆ డబ్బులు కూడా ఇంకా చెల్లించలేదు అనే ఆరోపణలు ఎదుర్కుంటోంది. మొత్తానికి ట్విటర్ ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ చేతికొచ్చాకా తీసుకున్న అనేక సంచలన నిర్ణయాలు కంపెనీని నిత్యం వార్తల్లో నిలిచేలా చేశాయి. ఇప్పుడు ఆర్థిక మాంధ్యం ఎఫెక్ట్ ట్విటర్ పై స్పష్టంగా కనిపిస్తోంది. మున్ముందు ఇంకెలాంటి వార్తలు చూడాల్సి వస్తుందో మరి.