ఎన్నికల శంఖారావం పూరించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలని భావిస్తోంది వైఎస్సార్సీపీ పార్టీ. అందుకోసం సామాజిక అనుసంధాన వేదికల్లో చురుగ్గా ఉండమని తమ పార్టీ కార్యకర్తలకు స్వయానా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలపడంతో యూత్‌ను టార్గెట్ చేయడానికి... యూత్ సహాయంతో ఇప్పుడు డిజిటల్ ఆర్మీ సిద్ధమవుతోంది. ఈ డిజిటల్ ఆర్మీ కోసం ఇప్పటికే 200 మందికి పైగా యువతీ యువకులను ఎంపిక చేశారు.
ఆ వాలంటీర్లకు పార్టీ ఐటి విభాగం ప్రత్యేకంగా తర్ఫీదునివ్వనుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలకు ఈ డిజిటల్ సైన్యం పూర్తి స్థాయి బాధ్యత వహించనుంది. అలాగే వివిధ జిల్లాలలో పార్టీ ఆధ్వర్యంలో జరిగే సామాజిక కార్యక్రమాలను కూడా ఈ డిజిటల్ ఆర్మీ ఇంటర్నెట్ ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందనేది సమాచారం.
పూర్తిగా నిపుణులైన యువ కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచే ఈ డిజిటల్ సైన్యంలో కొందరిని ఎంపిక చేసి వారితో జగన్ ప్రత్యేకంగా శనివారం సమావేశం కానున్నారు. అందుకు గాను తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం వేదిక కానుంది. ఈ సమావేశంలో డిజిటల్ సైనికుల పాత్ర.. వారి బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ మొదలైన అంశాలపై జగన్ చర్చించనున్నారు.
అలాగే యువతీ యువకుల సందేహాలను కూడా నివృత్తి చేయనున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్లో జగన్ పార్టీకి 13 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉండడం అనేది ఈ డిజిటల్ ఆర్మీ ప్రచారకర్తలకు బాగా కలిసి వచ్చే అంశంగా పరిగణించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ఫాలోవర్ల కంటే జగన్ ఫాలోవర్లే సోషల్ మీడియాలో రోజు రోజుకూ పెరగడమే అందుకు ప్రధాన కారణం.