కడప జిల్లా వేదికగా ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవిలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా.. ఇప్పుడు కడప జిల్లాకు చెందిన ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
ఎనిమిదో రోజుకు చేరిన సీఎం రమేష్, బీటెక్ రవిల ఉక్కు దీక్ష
కడపలో స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకుంది. రమేష్, బీటెక్ రవిల ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ వర్గాలలో ఆందోళన నెలకొంది. వీరి దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. మంగళవారం కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌కు, డీఎంకే నేత కరుణానిధి కుమార్తె కనిమొళి స్వయంగా వచ్చి సంఘీభావం ప్రకటించారు. హామీలను కేంద్రం వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. గతం వారం రోజులుగా ఈ దీక్షా స్థలానికి తెలుగుదేశం నాయకులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు కూడా వచ్చి మద్దతు తెలిపారు.