YSR Family: వైఎస్‌ విజయమ్మకు వైఎస్సార్‌సీపీ గట్టి కౌంటర్‌.. సంచలనం రేపుతున్న లేఖ

YSR Congress Party Released Counter Letter On YS Vijayamma: కుటుంబంలో ఆస్తుల తగాదాపై వైఎస్‌ విజయమ్మ రాసిన లేఖపై వైఎస్సార్‌సీపీ ప్రతిగా ఘాటు లేఖ విడుదల చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 29, 2024, 11:26 PM IST
YSR Family: వైఎస్‌ విజయమ్మకు వైఎస్సార్‌సీపీ గట్టి కౌంటర్‌.. సంచలనం రేపుతున్న లేఖ

YSRCP Letter Viral: వైఎస్సార్‌ కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల వివాదంపై లేఖాస్త్రాలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. తన బిడ్డల మధ్య ఏర్పడిన వివాదంపై వైఎస్ విజయమ్మ లేఖ విడుదల చేయగా.. దానికి పోటీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌంటర్‌ లేఖ విడుదల చేసింది. తమ నాయకుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విజయమ్మతోపాటు షర్మిల చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా మొత్తం 16 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ వదిలింది.

Also Read: YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!

తన లేఖలో వైఎస్‌ విజయమ్మ చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తూనే కౌంటర్‌ బదులు ఇచ్చింది. వైఎస్సార్‌ భార్యగా.. వైఎస్‌ జగన్‌ తల్లిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని చెబుతూనే ఆమె విడుదల చేసిన బహిరంగ లేఖపై కొన్ని అంశాలు విజయమ్మతోపాటు ప్రజలకు తెలపాలని లేఖ విడుదల చేసింది. జగన్‌ను న్యాయపరంగా ఇబ్బందిపెట్టేందుకు.. బెయిల్‌ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ ప్రస్తావించకపోవడంపై వైఎస్సార్‌సీపీ విస్మయం వ్యక్తం చేసింది. 'విజయమ్మ తన లేఖలో పలు అంశాలను పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్సార్‌ అభిమానులను పక్కదోవపట్టించడమే కదా?' అని ప్రశ్నించింది.

Also Read: YS Vijayamma: కన్న కొడుకు జగన్‌ మోసంపై వైఎస్‌ విజయమ్మ ఆవేదన.. అభిమానులకు సంచలన లేఖ

2024 ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులు జట్టు కడితే జగన్‌ ఒక్కడే పోరాడుతున్న విషయాన్ని మరిచి 16 నెలలు జైల్లో ఉంచి ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్‌కు విజయమ్మ ఎలా ఓటు వేయడని అడుగుతారని వైఎస్సార్‌సీపీ నిలదీసింది. అప్పుడే విజయమ్మ షర్మిల వైపు ఉన్నారని స్పష్టం చేసింది. వైఎస్సార్‌ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా? అని ప్రశ్నించింది. కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లు కారణంగా విజయమ్మ న్యాయఅన్యాయాల విచక్షణను విస్మరించారని తప్పుబట్టింది.

 

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ లేఖ

1. దివంగత మహానేత వైయస్సార్‌గారి భార్యగా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తల్లిగా విజయమ్మని అమితంగా గౌరవిస్తాం. వైయస్సార్‌ కుటుంబ వ్యవహారంపై విజయమ్మ బహిరంగ లేఖ విడుదలచేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం.

2. విజయమ్మ రాసిన లేఖలో జగన్‌ ను లీగల్‌గా ఇబ్బందిపెట్టేందుకు, తద్వారా బెయిల్‌ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్‌మెంట్‌ ఉన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు స్టేటస్‌-కో ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యబదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని, అందుకే అటాచ్‌మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, సరస్వతీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిల సహా న్యాయసలహాలు ఉన్నప్పటికీ, తప్పు అని తెలిసినప్పటికీ మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీచేసిన మాట వాస్తమే కదా? షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై జగన్‌ కి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి, తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా?  విజయమ్మ లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైయస్సార్‌ అభిమానులను పక్కదోవపట్టించడమే కదా?

3. 2024 ఎన్నికల్లో జగన్‌ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైయస్సార్‌ని ఎఫ్ఐఆర్‌లో పెట్టిన,  తన కుమారుడ్ని అన్యాయంగా 16నెలలు జైల్లోపెట్టిన కాంగ్రెస్‌కు ఓటు వేయండంటూ, వైయస్సార్‌సీపీని ఇబ్బందిపడుతూ వీడియో విడుదలచేసి విజయమ్మ షర్మిల వైపు ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగాచెప్పారు. దివంగత మహానేత, వైయస్సార్‌ రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్‌ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా? రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు, కనీసం తటస్థవైఖరిని మరిచిపోయి, పక్షపాతం వహించిన వైనం చూసి వైయస్సార్‌ అభిమానులు తీవ్రంగా కలత చెందారు, బాధపడ్డారు. 

4. ఇప్పుడు షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో, సరస్వతీ కంపెనీ వ్యవహారంలో న్యాయపరంగా ఇబ్బందులు వచ్చి, స్వయంగా ఆమె కుమారుడి బెయిల్‌ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసికూడా మోసపూరితంగా, షేర్ల సర్టిఫికెట్లు పోయాయని చెప్పి, ఒరిజనల్‌ షేర్‌ సర్టిఫికెట్‌ లేకుండా, జగన్‌ సంతకాలు లేకుండా,  ఎవ్వరికీ తెలియకుండా షేర్లను బదిలీచేసి, షర్మిలతోనే విజయమ్మగారు ఉన్నారని మరోసారి స్పష్టంగా చెప్పారు. 

5. జగన్‌ కి, షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం టీడీపీ సోషల్‌ మీడియా అక్కౌంట్‌లో ప్రత్యక్షం కావడం, విజయమ్మగారు కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీవారు విడుదలచేయడం, పలు సందర్భాల్లో శ్రీ జగన్‌గారిపై షర్మిలగారు అనుచిత వ్యాఖ్యలు చేసినా, జగన్‌గారు ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడకపోయినా విజయమ్మగారు ఏరోజూ సరిదిద్దే కార్యక్రమం చేయకపోవడం, ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. 

6. కోర్టుల్లో ఉన్న కేసులను ప్రతికూల రీతిలో ప్రభావితం చేసేలా షర్మలగారి ప్రవర్తన, చర్యలు ఉన్నా, ఒకవైపు ఆస్తులపై హక్కులు కోరుతూ, మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించినా, తప్పుడు కేసులపై శ్రీ జగన్‌గారు చేస్తున్న పోరాటం, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆమెకు ఎలాంటి ఆందోళన లేనట్లు ప్రవర్తించినా, జగన్‌ని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు, బలహీనుడిని చేసేందుకు అనుగుణంగా ఆమె నడుచుకున్నా, షర్మిలగారు వేసిన ప్రతి అడుగు కూడా ప్రత్యర్థులకు లబ్ది చేకూర్చేలానే ఉన్నా, మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను జగన్‌ అనుభవించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు? ఒక తల్లిగా విజయమ్మ బాసట ఎవరికి ఉండాలి? అన్న బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. 

7. రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం ఉన్నప్పుడల్లా జగన్‌ ని షర్మిల ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై, రాజశేఖరరెడ్డిని ఎఫ్ఐఆర్‌లోపెట్టిన పార్టీకి, అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చారు. పోనీ రాజకీయాలు ఇంతే అనుకున్నా,  ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి, ఆజన్మాంత శత్రువు మాదిరిగా జగన్‌ని షర్మిల అనరాని మాటలు అన్నారు. ఎన్నికల సమయంలో శ్రీ జగన్‌గారిపై దాడి జరిగితే ఎగతాళి చేసి, అమానవీయంగా మాట్లాడింది షర్మిలగారు కాదా? వీటన్నింటినీ శ్రీ జగన్‌గారు ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు? పరువుతీసింది ఎవరు? నిజమైన బాధితులు ఎవరు? జగన్‌ కాదంటారా? 

8. కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లు కారణంగా విజయమ్మ న్యాయ అన్యాయాల విచక్షణను విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణివల్ల, సరస్వతీ కంపెనీల విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మగారు దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. 

9.  వైయస్సార్‌ జీవించి ఉన్నపుడే జగన్‌గారూ కంపెనీలు నడిపారు, అలాగే షర్మిలగారు తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైయస్సార్‌గారి మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? తనకుమార్తెకు వైయస్సార్‌గారు తన పూర్వీకుల ఆస్తులతో పాటు, తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చాడు. శ్రీ జగన్‌గారి ఆస్తులు తనవికాదు కాబట్టి, ఇవ్వలేదు. ఎందుకంటే ఈ శ్రీ జగన్‌గారి స్వార్జితం కాబట్టి. 

10. వైయస్సార్‌ బ్రతికి ఉండగానే షర్మిలకి పెళ్లై 10 ఏళ్లు, వైయస్సార్‌ మరణించి మరో 1౦ ఏళ్లు గడిచిన తర్వాత,  అంటే  20 ఏళ్లు తర్వాత జగన్‌ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లకాలంలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు వివిధ కాలాల్లో షర్మిల జగన్‌ ద్వారా పొందినా తన సోదరుడిపట్ల ఆమె ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు. 

11. తన స్వార్జితంతో సంపాదించిన ఆస్తులను, లవ్‌ అండ్‌ అఫెక్షన్‌తో షర్మిలకు ఇస్తున్నాని జగన్‌ ఎంఓయూ రాస్తే,. దానిపై విజయమ్మగారూ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్‌గారి స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించనట్టే. నిజంగా ఉమ్మడి ఆస్తులు అయితే, వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదని, చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతికుటుంబానికి తెలుసు. 

12. ఇంత యాగీ చేస్తున్న షర్మిలగారు ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? లేక రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర ఆమె పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా? 

13. పైగా ఈ కంపెనీల మీద, జగన్‌గారి మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా వారిని బలపరుస్తూ, కంపెనీలను బలహీనపరుస్తూ సాగుతున్న నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే, ఇలా చేస్తారా? ఇలా శ్రీ జగన్‌గారిని, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా?

14. ఇప్పుడు వైయస్సార్‌ కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఒకటే వాదనను వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు స్థాయిగల వ్యక్తులు, వివిధ సందర్భాల్లో, వివిధ పద్ధతుల్లో వినిపించడం వల్ల పదేపదే బురదజల్లడం అవుతుంది తప్ప, దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.

15. జగన్‌ స్వార్జితమైన ఆస్తిలో, ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో భాగం కావాలని షర్మిలగారు ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? అందులోని  లేఖను టీడీపీ విడుదలచేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి, ఆమె తన ప్రేమానురాగాలు చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏమి చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని శ్రీ జగన్‌గారు ఇదివరకే స్పష్టంచేశారు. 

16. ఈ నేపథ్యంలో  వైయస్‌ఆర్‌ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టంచేసింది. 

ఇట్లు
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x