జనసేన అధినేతపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై తెగ మాట్లాడుతున్న పవన్.. వాస్తవానికి జనానికి ఏమీ చేయలేరని విమర్శించారు. గతంలో ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దేశమంతా తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పిన పవన్...తీరా నోటీసు ఇచ్చిన తర్వాత కనిపించకుండా పారిపోయారని .. అలాంటి వ్యక్తిని నమ్ముకుంటే ఇక అంతే సంగతులను బొత్స ఎద్దేవ చేశారు. పవన్ మాటలు అద్భుతంగా ఉంటాయి కానీ చేతల్లో వచ్చే సరికి ఫలితం ఏమీ కనిపించదని బొత్స విమర్శించారు.
రైల్వే జోన్ కావాలంటే...
జనాలు రోడ్డెక్కితే రైల్వే జోన్ వస్తుందన్న పవన్ వ్యాఖ్యలపై బొత్స భిన్నంగా స్పందించారు. దీని కోసం జనాలు రోడ్డెక్కాల్సిన అవసరం లేదు.. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు వచ్చి రైలు పట్టాలపై కూర్చుంటే జోన్ వచ్చి తీరుతుంది. కానీ చంద్రబాబు అలా చేయలేరు.. చేయరు కూడా.. ఎందుకంటే చంద్రబాబుకు సొంత ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం. టీడీపీ ఎన్నికల కోసమే అవిశ్వాసం డ్రామా ఆడుతోందని విమర్శించారు. రైల్వే జోన్ విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని బొత్స ఆరోపించారు.