కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లులో శనివారం రాత్రి ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్ కాలనీలో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళను విజయవాడలోని ఓ లోకల్ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న తేజస్విని(25)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన మట్టపల్లి పవన్ కుమార్, తేజస్విని దంపతులు ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి ప్రేమ వివాహానికి అప్పట్లో ఒప్పుకోని పెద్దలు రెండేళ్ల క్రితం తమ అంగీకారంతో వీరికి మరోసారి ఘనంగా వివాహ వేడుక జరిపించినట్టు తెలుస్తోంది. పవన్ కుమార్, తేజస్విని దంపతులకు ఒక పాప కూడా ఉంది. ఉయ్యూరులోని బజాజ్ రిలయన్స్ స్టోర్‌లో పని చేస్తున్న పవన్ కుమార్ ఇటీవల షిర్డీకి వెళ్లాడు. ఇదిలాఉంటే, శనివారం సాయంత్రం తేజస్వినికి, అత్త అన్నపూర్ణా దేవికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిందని, అనంతరం గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకున్న తేజస్విని ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి కిటికీ తలుపులు తెరిచి చూడగా అప్పటికే ఆమె గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శవమై వేళ్లాడుతూ ఉండటాన్ని గుర్తించారు.
తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు తేజస్విని మృతి చెందినట్లు నిర్ధారించుకుని ఆమె స్నేహితురాలి ద్వారా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉంటున్న తేజస్విని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తేజస్విని తల్లిదండ్రులు అక్కడికి చేరుకునే వరకు వేచిచూసిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో వారి సమక్షంలోనే తేజస్విని మృతదేహాన్ని కిందికి దించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తేజస్వి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్ 174వ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. తేజస్విని ఆత్మహత్యపై దర్యాప్తు ప్రారంభించారు.