దసరా పండగకు 4480 ప్రత్యేక బస్సు సర్వీసులు, ఎక్కడి నుంచి ఎక్కడికి.. పూర్తి వివరాలు

దసరా పండగకు 4480 ప్రత్యేక బస్సు సర్వీసులు అందిస్తున్న టీఎస్ఆర్టీసీ

Last Updated : Oct 6, 2018, 12:17 PM IST
దసరా పండగకు 4480 ప్రత్యేక బస్సు సర్వీసులు, ఎక్కడి నుంచి ఎక్కడికి.. పూర్తి వివరాలు

దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 4,480 ప్రత్యేక బస్సు సర్వీసులు అందించనుంది. ఈమేరకు శుక్రవారం ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంగారెడ్డి రీజినల్ మేనేజర్ యాదగిరి ఈ ప్రత్యేక బస్సుల వివరాలను మీడియాకు వెల్లడించారు. తెలంగాణలోని అన్ని పట్టణాలు, పల్లెలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ముఖ్య పట్టణాలు, కర్ణాటకలోని బీదర్, యాద్గిర్, బెంగుళూరు, మైసూరు వంటి ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు అందించనున్నట్టు రంగారెడ్డి ఆర్ఎం స్పష్టంచేశారు. ప్రత్యేక బస్సులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్‌, కాచిగూడ బస్‌స్టేషన్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట,ఈసీఐఎల్‌తోపాటు నగర శివార్లలోని ఆధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద నుంచి బయల్దేరుతాయని ఆర్ఎం తెలిపారు. 

ఈ ప్రత్యేక బస్సులు అక్టోబర్ 8వ తేదీ నుంచి 18 వరకు నడుస్తాయని, మళ్లీ పండగ తర్వాత నగరానికి బయల్దేరి వచ్చే వారి కోసం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం వివరించారు. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ద్వారా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు. 

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రామగుండం, గోదావరిఖని, నిర్మల్, బాన్సువాడ, కాళేశ్వరం వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి జేబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, కాళేశ్వరం, పరకాల, సూర్యాపేట, జనగాం, ఏటూరునాగారం, మంగపేట, తొర్రూరు, మోత్కూరు, మహబూబాబాద్ ప్రాంతాలకు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

మహబూబ్‌నగర్, తాండూరు, వికారాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, శ్రీశైలం, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్, అకోలా, షోలాపూర్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 

నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, మైదుకూరు, బనగానపల్లి, బద్వేల్, జమ్మలమడుగు, పొద్దుటూరు, పులివెందుల, కడప, రాజంపేట, రాయచోటి, కోడూరు, చిత్తూరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం కాచిగూడ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.

తెలంగాణలో హైదరాబాద్ సహా పలు పెద్ద పట్టణాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, తెనాలి, గుడివాడ, విజయనగరం, రాజోలు, పోలవరం, తాడేపల్లిగూడం, తణుకు, శ్రీకాకుళం, నర్సాపురం, భీమవరం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు వంటి ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది.

Trending News