సబ్సీడీపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన గొర్రెలు ఆంధ్రా మార్కెట్‌కి!!

Last Updated : Feb 20, 2018, 11:56 PM IST
సబ్సీడీపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన గొర్రెలు ఆంధ్రా మార్కెట్‌కి!!

తెలంగాణ ప్రభుత్వం సబ్సీడీపై పంపిణీ చేసిన గొర్రెలని ఆంధ్రాకు తరలిస్తున్న ఓ ముఠా నల్గొండ జిల్లా పోలీసులకు అడ్డంగా పట్టుబడింది. తెలంగాణ నుంచి ఆంధ్రా వైపు వెళ్తున్న మూడు లారీలు, ఓ డీసీఎం వాహనాన్ని తనిఖీ చేసిన మాడ్గులపల్లి పోలీసులు.. అందులో తెలంగాణ సర్కార్ పంపిణీ చేసిన గొర్రెలని ఆ ముఠా ఆంధ్రాకు తరలిస్తున్నట్టు గుర్తించారు. నాలుగు వాహనాల్లో కలిపి మొత్తం 585 గొర్రెలు లభ్యం కాగా ఇందులో 340గొర్రెలు సబ్సిడీ కింద పంపిణీ చేసినవి అని నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. 

మిర్యాలగూడ రూరల్ సీఐ రమేశ్‌ బాబు, మాడ్గులపల్లి ఎస్‌ఐ సురేష్‌ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం వాహన తనిఖీల్లో భాగంగా మాడ్గులపల్లి పోలీసులు స్థానిక టోల్‌గేట్ వద్ద ఐదు వాహనాల్లో 585 గొర్రెలను తరలించడం గమనించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. మండల పశువైద్యాధికారి సహాయంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అందులో 340 సబ్సిడీ గొర్రెలు వున్నట్టు అధికారికంగా ధ్రువీకరించినట్టు సమాచారం. 

నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు, చిట్యాల, యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌, ఆలేరు మండలాల నుంచి ఈ గొర్రెలను సేకరించిన ముఠా వాటిని ఆంధ్రాకు తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అక్రమంగా గొర్రెలను తరలించడానికి ఉపయోగించిన వాహనాలను సీజ్‌చేసిన పోలీసులు.. డ్రైవర్లు సతీష్‌కుమార్, బెల్లి అంజయ్య, నందగిరి వెంకటేశ్వర్లు, జనార్దన్‌తో పాటు మాచర్లకు చెందిన దళారులు సింగాల రాజు, అందె జానయ్య, బి.వెంకటేశ్వర్లు,  సైద రాజుపై కేసు నమోదు చేశారు. 

Trending News