Ra Kadali Ra: జగన్‌ను దించడానికి మేం 'సిద్ధం'గా ఉన్నాం: 'రా కదిలి రా' సభలో చంద్రబాబు

Babu fire on Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ 'భీమిలి'లో ఏర్పాటుచేసిన 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావం పూరించారు. అక్కడ చేసిన ప్రసంగంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కౌంటర్‌ ఇచ్చారు. మీరు ఎన్నికలకు సిద్ధమైతే.. మేం నిన్ను దించడానికి సిద్ధమని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 27, 2024, 08:01 PM IST
Ra Kadali Ra: జగన్‌ను దించడానికి మేం 'సిద్ధం'గా ఉన్నాం: 'రా కదిలి రా' సభలో చంద్రబాబు

Chandrababu Speech:  అధికార వైఎస్సార్‌ సీపీ ఎన్నికల శంఖారావం పూరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. భీమిలిలో జరిగిన 'సిద్ధం' బహిరంగ సభలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన ప్రసంగంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో జగన్‌ ప్రసంగానికి కౌంటర్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోందని తెలిపారు. మరో 74 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని పోతుందని చెప్పారు.

ఉరవకొండ సభ వేదికగా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. భీమిలి సభలో సీఎం జగన్‌ సభలో ఓటమి ఖాయమని తెలిసిందని, జగన్ మాటల్లో తేడా కనిపిస్తోందని చెప్పారు. మొన్నటి దాకా గెలుపు ధీమా వ్యక్తం చేయగా ఇప్పుడు ఓటమి ఖాయమని జగన్‌ భావిస్తున్నట్లు తెలిపారు. 'ఆయన చేసిన పనులు, పెట్టిన ఇబ్బందులకు జగన్‌ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరపడ్డాయి' అని పేర్కొన్నారు. ఏపీకి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉందన్నారు.

'భీమిలి సిద్ధం అనే సమావేశం పెట్టారు. సిద్ధం అని నువ్వు అనడం కాదు.. నిన్ను దించడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అని చంద్రబాబు తెలిపారు. జగన్‌ పాలనలో ప్రతి రంగం దెబ్బతిన్నదని ఆరోపించారు. ఎక్కడైనా మంచి రోడ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో నష్టపోని వ్యక్తి లేడని విమర్శించారు. '2019లోనే నేను ఒక మాట చెప్పాను. ఒక్కసారి అని మోసపోతే చాలా నష్టపోతారు... ఆలోచించమని చెప్పాను' అని గుర్తుచేశారు. జగన్‌ పాలనలో తెలుగు జాతి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉల్లి, ఆలుకు తేడా తెలియని సీఎం
అనంతపురం జిల్లాలో వర్షపాతం తక్కువ అని, ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లివ్వాలనేదే తన జీవిత లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. హంద్రీ-నీవా వంటి ఎన్నో నీటి ప్రాజెక్టులను టీడీపీ హయాంలో ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు మనవే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఉల్లిగడ్డ, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ తెచ్చిన భూ రక్షణ చట్టం భక్షణగా మారిందని.. తాము అధికారంలోకి వస్తే భూ రక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఓటర్ల రద్దుపై బాబు స్పందిస్తూ 'ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలపెట్టం. వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా' అని తెలిపారు.

అన్న, చెల్లి కొట్లాడితే నేను కారణమా?
ఏపీలో వైసీపీ సినిమా అయిపోయిందని చంద్రబాబు తెలిపారు. సీట్లు ఇచ్చినా ఆ పార్టీలో నాయకులు వెళ్లిపోతున్నారని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పారిపోతున్నారని వివరించారు. జగన్‌, ఆయన చెల్లి కొట్టుకుంటే దానికి కారణం నేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో అందరూ తనకు స్టార్‌ క్యాంపెయినర్లు అని పేర్కొన్నారు. వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు, యువత వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని బాబు తెలిపారు.

Also Read: House Collapsed: కామారెడ్డి ఎమ్మెల్యే సంచలనం.. రోడ్డు కోసం తన ఇల్లునే కూల్చేశాడు

Also Read: Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News