ప్రత్యేక హోదా పోరు: వైసీపీ బంద్‌కు ప్రజా సంఘాల మద్దతు

                             

Last Updated : Jul 23, 2018, 05:25 PM IST
ప్రత్యేక హోదా పోరు: వైసీపీ బంద్‌కు ప్రజా సంఘాల మద్దతు

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఇచ్చిన బంద్ కు క్రమ క్రమంగా అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు దీనికి సంపూర్ణ మద్దతు పలికాయి. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం, ముస్లిం జన జాగృతి సమితి బంద్‌కు తమ మద్దతు ప్రకటించాయి. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైసీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగుతోంది.  ఏపీకి ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని..విభిన్న అవకాశాలతో ఏపీ భవిష్యత్తు బాగుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం ( రేపు) నిర్వహించనున్న బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు షబ్బీర్‌ అహ్మద్ ప్రకటించారు..ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ఏపీకి చేసిన మోసం చేశాయని అందుకే వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ కు మద్దుతు ప్రకటించినట్లు షబ్బీర్‌ అహ్మద్ తెలిపారు.

రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ పార్టీ మోసం చేయగా... అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు హోదా సాధనకు తూట్లు పొడిచాయని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ విభాగం అధ్యక్షుడు  కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. హోదా ప్రయోజనాల్నీ.. ప్యాకేజీలోనే ఉన్నాయని.. వాటిలో అన్నీ ఇస్తున్నారని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో  తిరుపతి సభలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారని..అ క్రమంలో ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలన్న వైసీపీ ఆలోచనతో తాము ఏకీభవిస్తున్నామని కొమ్మారెడ్డి వెల్లడించారు.

Trending News