అవిశ్వాసం తీర్మానం విషయంలో ఏ పార్టీ.. ఎవరికి మద్దతిస్తుందనే విషయం స్పష్టమైంది.. కానీ శివసేన నిర్ణయం మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. శివసేన పార్టీ ఎన్డీయే పక్షాన నిలబడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే మాత్రం తన వైఖరిని ఇంకా బయటపెట్టలేదు. కండబలంతో గెలిచినంత మాత్రాన బీజేపీది విజయనిపించుకోదంటూ ఈ రోజు శివసేన సొంత పత్రిక సామ్నాలో కథనం ప్రచురితమైంది. తాజా కథనాన్ని బట్టి చూస్తుంటే శివసేన మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శివసేన పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ మోడీ సర్కార్ వచ్చిన ధోకా ఏమీ లేదు..కానీ ప్రతిపక్షాల ఐక్యత సాధిస్తే వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కార్ గట్టి పోటీ ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే ప్రతిపక్షాలు ఏకం కాకూడదని బీజేపీ బలంగా కోరకుంటోంది. మరోవైపు ఎన్డీయేలోని మిత్రపక్షాలకు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంది... అయితే ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన శివసేన వైఖరి బీజేపీకి మింగుపడటం లేదు..
ఇదిలా ఉండగా తాజాగా అవిశ్వాస తీర్మానంపై పార్టీకి చెందిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు, లోక్ సభలో చర్చ సమయంలో తమ అధినేత ఉద్ధవ్ థాకరే మద్దతుకు సంబంధించి నిర్ణయాన్ని వెలువరిస్తారని తెలిపారు. తాజా వ్యాఖ్యలతో శివసేన ఎవరి పక్షాన నిలబడుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.