తిరుమల తిరుపతిలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డు ధరలు మళ్లీ మిన్నంటాయి. ప్రస్తుతం ముడిసరుకుల ధరలు పెరగడంతో సిఫారసు ఉత్తరాల ద్వారా అందించే ప్రసాదాల ధరలు పెంచనున్నట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. టీటీడి ఉద్యోగుల సిఫారసు లేఖల ద్వారా అదనపు ప్రసాదాలను కొంత మొత్తం ఎక్కువగా తీసుకొని అందించే సంప్రదాయం తిరుమలలో ఉంది. ఆలయం వెలుపల జారీ చేసే ఈ లడ్డు ధరలను పెంచనున్నట్లు జేఈఓ ప్రకటించారు. దర్శనంతో నిమిత్తం లేకుండా జారీ చేసే చిన్న లడ్డు ధరను రూ.25 నుండి రూ.50 రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు.
అలాగే పెద్ద లడ్డు ధరను రూ.100 నుండి రూ.200 రూపాయలకు పెంచనున్నారు. అదేవిధంగా చిన్న వడ ధరను రూ.25 నుండి రూ.100 రూపాయలు, పెద్దవడ ధరను రూ.50 నుండి రూ.200 రూపాయలకు పెంచుతున్నట్లు జేఈఓ తెలిపారు. దివ్యదర్శనంలో భాగంగా ఇచ్చే రాయితీ లడ్డూ ధరలు, వీఐపీ దర్శన టికెట్లపై ఇచ్చే అదనపు లడ్డూ ధరలు మాత్రం పెంచడం లేదని ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు.