చంద్రబాబు సభకు భారీ ఏర్పాట్లు.. యాభై వేలకు పైగా జనం వస్తారని అంచనా..!

ప్రకాశం జిల్లా మార్టూరులో నిర్వహించబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి

Last Updated : Nov 2, 2018, 10:30 AM IST
చంద్రబాబు సభకు భారీ ఏర్పాట్లు..  యాభై వేలకు పైగా జనం వస్తారని అంచనా..!

ప్రకాశం జిల్లా మార్టూరులో నిర్వహించబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు యాభై వేల మందికి పైగా ఈ సభకు హాజరవుతారని అధికారిక అంచనా. వెలుగొండలో కడుతున్న ప్రాజెక్టును సందర్శించిన అనంతరం చంద్రబాబు, గుంటూరు-ప్రకాశం జిల్లా సరిహద్దులోని డేగరమూడి గ్రామాన్ని కూడా సందర్శి్స్తారు. అక్కడ నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత జాతీయ రహదారి మీదుగా  మార్టూరులోని బహిరంగ సభకు చేరుకుంటారు.

ఈ క్రమంలో మార్టురులో ఏర్పాట్లను దగ్గరుండి తెలుగుదేశం పార్టీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర మంత్రి నారాయణ కూడా మార్టూరు ప్రాంతాన్ని సందర్శించారు. వేదిక, స్టాల్స్  మొదలైనవాటిని పరిశీలించారు. అలాగే కలెక్టర్ వినయ్ చంద్‌తో కూడా చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మార్టూరులో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలను కూడా రప్పించాలని నిఘా వ్యవస్థను పర్యవేక్షించే పోలీసు యంత్రాంగానికి తెలియజేశారు.

అలాగే వెలుగొండ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంయుక్త కలెక్టర్‌ నాగలక్ష్మి , ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మొదలైనవారు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.  వెలుగొండ వద్ద కన్వేయర్ బెల్టును సీఎం ప్రారంభిస్తారు. అలాగే నల్లమల ప్రాంతాన్ని సందర్శించబోయే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా జరుగుతున్నాయి. 22 మంది ఎస్సైలు, 64 మంది  ఏఎస్సైలు, 205 మంది పోలీసులు, 200 మంది హోంగార్డులు, 50 మంది మహిళా పోలీసులు, రెండు కూబింగ్‌ పార్టీలు బందోబస్తుకి సిద్ధమయ్యారు. 

Trending News