పెట్రోల్ ధర రూ.100 చేరుతుందేమో: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబెట్టారు.

Last Updated : Sep 4, 2018, 01:59 PM IST
పెట్రోల్ ధర రూ.100 చేరుతుందేమో: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబెట్టారు. నోట్లరద్దుతో కేంద్రం సాధించినదేమీ లేదని ఆయన తెలిపారు. కేంద్ర విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో తాను ఊహించని రీతిలో ధరలు పెరుగుతున్నాయని.. పెట్రోల్ ధర కూడా లీటర్ రూ.100 చేరుతుందేమోనని చంద్రబాబు అనుమానాన్ని వ్యక్తం చేశారు. రూపాయి విలువ రోజు రోజుకీ పతనం అవుతుందని.. డాలరుతో రూపాయి మారకం వంద రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెలిపారు.

ఇప్పటికే ఏటీఎంలలో డబ్బులు నిండుకుంటున్నాయని.. బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకం కూడా పోతుందని ఆయన తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరులను పక్కన పెట్టుకున్న ప్రధానిమంత్రి నీతి, నిజాయతీల గురించి మాట్లాడడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చంద్రబాబు తెలిపారు. డీమానిటైజేషన్ అనే విధానాన్ని తాను అతిపెద్ద ఫెయిల్యూర్‌గా భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

"ప్రస్తుతం భారతదేశం ఈ మాత్రమైనా ముందుకెళ్తుందంటే అది దేశానికున్న బలం వల్లేగానీ.. ఎన్డీఏ ప్రభుత్వపు గొప్పతనం వల్లకాదు. వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే మనం మరిన్ని ఫలాలు సాధించేవాళ్లం. రేపొద్దున్న మన ఆర్థిక ప్రగతి ఆగిపోతే దానికి కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించమని నేను ప్రభుత్వానికి ఎప్పుడో చెప్పాను. కానీ డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత ఖరీదైన పద్ధతిగా మార్చారు. పైగా బ్యాంకింగ్ రంగంలో ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతోంది. మరి ప్రజలు బ్యాంకులను గానీ, ప్రభుత్వాన్ని గానీ ఎలా నమ్ముతారు" అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Trending News