Perni Nani: దొంగలు దొంగలు కూడబలుక్కున్నట్టు 'మోదీ, చంద్రబాబు, పవన్' కలయిక

Perni Nani Fire On Narendra Modi Speech: ఎన్డీయే కూటమి 'ప్రజాగళం' సభలో నాయకుల ప్రసంగాలను మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బాబు, పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 17, 2024, 08:54 PM IST
Perni Nani: దొంగలు దొంగలు కూడబలుక్కున్నట్టు 'మోదీ, చంద్రబాబు, పవన్' కలయిక

YSRCP: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే కూటమి నిర్వహించిన 'ప్రజాగళం' సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం, ఆ సభ తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగలు దొంగలు కూడబలుక్కున్నట్టు మోదీ, చంద్రబాబు, పవన్ కలిసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నాడు తిట్టిన బాబును ప్రధాని ఏం గంగాజలంతో కడిగారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను దగా చేసిన ప్రధాని మోదీకి ఎందుకు చంద్రబాబు భజన చేస్తున్నారని నిలదీశారు.

Also Read: Narendra Modi: మాకు 400 సీట్లు ఇస్తే వికసిత్‌ భారత్‌.. వికసిత్‌ ఏపీ సాధ్యం: ప్రధాని మోదీ

 

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో జరిగిన 'ప్రజాగళం' బహిరంగ సభపై ఆదివారం పేర్ని నాని స్పందించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడుతూ.. 'ప్రజాగళం సభ వైసీపి ఐదో సిద్ధం సభలాగా ఉంది' అని తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఏం చెప్పతలచుకున్నారు? వారికి ఓటేస్తే ఏం చేస్తారో ఎందుకు చెప్పలేదు? అని పేర్కొన్నారు. '2019లో పాచిపోయిన లడ్డూ ఇప్పుడు ఎలా తాజా లడ్డూగా మారిందో పవన్ చెప్పాలని నిలదీశారు. దేశానికి మోదీ ఒక టెర్రరిస్టు అన్న చంద్రబాబు ఇప్పుడు మోదీపై ఎందుకు ప్రేమ చూపుతున్నారు? అని సందేహం వ్యక్తం చేశారు.

Also Read: BRS Party: రేవంత్‌ రెడ్డి వంద రోజుల మోసపు పాలన.. వంద తప్పులు.. వంద ప్రశ్నలు

 

'నా నోటీతో మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించు మోదీ అని చంద్రబాబు అంటున్నారు. జగన్ నుంచి నన్ను కాపాడు అని చంద్రబాబు మోదీని వేడుకున్నారు' అని పేర్ని నాని తెలిపారు. 'ప్రత్యేక హోదా అని చెప్పి ఏపీని మోసం చేశారు. కానీ మోదీ గురించి చంద్రబాబు తెగ భజన చేశారు. దొంగలు దొంగలు కూడ బలుక్కున్నట్టు మోదీ, చంద్రబాబు, పవన్ కలిశారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీఆర్ కూడా  చంద్రబాబును దూషించారు' అని గుర్తు చేశారు. తోడల్లుడు, తమ్ముడు, వదిన, సహా బంధువులు కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని నాని పిలుపునిచ్చారు.

ఇక ఎన్డీయే కూటమిపై పేర్ని నాని ప్రశ్నలు లేవనెత్తారు. 'ఆ మూడు పార్టీల పొత్తు ఎవరికోసం? వారు కూడబలుక్కోగానే జనం ఓట్లేస్తారా?' అని ప్రశ్నించారు. 'సభ జరుపుకోవటం కూడా చేతకాక ప్రధానిని బొమ్మలాగా నిలబెట్టారు' అని సభలో జరిగిన తప్పిదాలను ప్రస్తావించారు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టించామని చెప్పిన మోదీ.. మరి విజయవాడలో 40 ఆలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబుతో సహవాసం చేయటం ఏంటి? అని నిలదీశారు. 'ఐదేళ్ల కిందట చంద్రబాబు అవినీతిపరుడు, పచ్చి రాజకీయ అవకాశవాది అని మోదీ చెప్పారు. అమరావతి రియల్ ఎస్టేట్ కుంభకోణం అన్నారు. అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామని ఎందుకు చేయలేదు?' మోదీని ప్రశ్నించారు.

'పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకున్నారనే మోదీ మరి చంద్రబాబుపై ఎందుకు విచారణ చేయలేదు? చంద్రబాబు అవినీతిని ఏ గంగాజలంతో కడిగారు? పోలవరానికి రావాల్సిన రూ.15 వేల కోట్లు వేయమని అడిగితే మోదీ ఎందుకు వేయలేదు? బాధిత రైతుల ఖాతాలను ఇచ్చి వారి ఖాతాలో వేయమంటే ఎందుకు వేయలేదు? విశాఖ ఉక్కును ఉంచుతారా? అమ్ముతారా? ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ జగన్ ని తిట్టటమే తప్ప ఏపీకి కావాల్సిన అంశాల గురించి ఎందుకు ప్రశ్నించలేదు?' అని పేర్ని నాని నిలదీశారు.

'సీఎం జగన్ ఏపీలో నాలుగు పోర్టులు నిర్మిస్తుంటే మోదీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు కొత్తగా అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు' అని పేర్ని నాని విమర్శించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు. విశాఖలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 'ఏఐసీసీ అంటే ఆలిండియా చంద్రబాబు కమిటీ. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, షర్మిల, తులసీరెడ్డిలాంటి వారు ఉన్నారు' అని చెప్పారు. ఎన్టీఆర్ ని పొడిచినట్టే మోదీని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'జెండాలు కలవటం అధికారం కోసమే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదు' అని పేర్ని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ పాలనను వివరిస్తూ.. 'జగన్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పరిపాలన చేస్తోంది. అవినీతి జరిగితే విచారణ జరుపుకోవచ్చు' అని సవాల్‌ విసిరారు. చంద్రబాబు అవినీతిపై సిట్ తో విచారణ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. బీజేపీకి రెండో, మూడు సీట్లు వస్తాయని మోదీ వచ్చి చంద్రబాబుతో కాళ్లబేరానికి దిగినట్లు ఉందని విమర్శించారు. టీడీపీతో పొత్తు కోసం బీజేపీతో చీవాట్లు తిన్నానని చెప్పిన పవన్‌ మరి రాష్ట్రం అభివృద్ధి గురించి ఎందుకు అడగలేదు? అని నిలదీశారు. మళ్లీ గెలిచేది సీఎం జగన్‌ అని ధీమా వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News