ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యాక మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ, తాను పార్టీ పెట్టాక ఇప్పటి వరకు చాలా ఓర్పుతో ఉన్నానని తెలిపారు. కొన్ని కొన్ని విషయాల్లో ప్రజల మాదిరిగానే తాను కూడా గందరగోళంలో ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
నిధులు సరిగ్గా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుందని.. అలాగే అన్నివిధాలుగా ఆదుకుంటున్నామని కేంద్రం అంటుందని.. ఇరువురిలో ఎవరు నిజం చెబుతున్నారో తాను తెలుసుకోవాలని భావిస్తున్నానని పవన్ తెలిపారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లితో పాటు లోక్‌సత్తా అధినేత జేపీతో కలసి తాను ఒక నిజ నిర్థారణ కమిటీ వేస్తానని పవన్ తెలిపారు. ఈ కమిటీ ఆ నిజాలు, అబద్ధాల వెనుక ఉన్న కథ ఏమిటో బయటకు తీసుకొస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు ఇచ్చిందో.. అందులో ఏమేమి ఖర్చు చేశారో.. ఇంకా ఎంత ఖర్చు పెట్టడానికి ఉందో ఆ వివరాలన్నీ.. చంద్రబాబు ప్రభుత్వం బహిర్గతం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో.. ఏ ఏ సందర్భాల్లో ఆ నిధులను ఇచ్చిందో కూడా బహిర్గతం చేయాలని పవన్ కోరారు.
ఇద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరు మాట దాటవేస్తున్నారని.. వారెవరో నిజ నిర్థారణ కమిటీ ఇచ్చే నివేదికలో బయట పడుతుందని పవన్ తెలిపారు. టీడీపీ, బీజేపీ.. ఈ రెండు పార్టీలు కూడా ఆంధ్రా ప్రజలకు మేలు చేయకుండా చేతులెత్తేస్తున్నాయని.. అందుకే తాను బాధ్యత తీసుకొని ప్రశ్నిస్తున్నానని పవన్ తెలిపారు. గతంలో జేపీని కలవడానికి, ఇప్పుడు ఉండవల్లిని కలవడానికి కూడా ఇదే కారణమని ఆయన తెలిపారు.
ఇరు ప్రభుత్వాలు తాను అడుగుతున్న వివరాలను మీడియా ముఖంగా వెల్లడించాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ వివరాలు ఈ నెల 15వ తేదీలోగా ఇరు ప్రభుత్వాలు బహిర్గతం చేయాలని పవన్ కోరారు. గతంలో ఇదే మాటను ప్రభుత్వాన్ని అడిగితే వెబ్ సైటులో చూసుకోమన్నారని.. కానీ అలాంటి విషయాలు ఏవీ వెబ్ సైటులో పొందుపరచలేదని పవన్ తెలిపారు.
తనను ఈ ఇరు పార్టీలు గౌరవిస్తే.. ఈ వివరాలు బహిర్గతం చేస్తాయని.. చేయకపోతే తదుపరి కార్యాచరణ ఏమిటో ఆలోచిస్తామని పవన్ తెలిపారు. ఈ నిజ నిర్థారణ కమిటీలో తాను భాగస్వామిని కాదని.. ఉండవల్లి, జేపీతో పాటు అపార అనుభవం కలిగిన మేధావులను ఈ కమిటీలో సభ్యులను చేసి.. వారు ఇచ్చే రిపోర్టు ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరు నాటకం ఆడుతున్నారన్న విషయాన్ని కనిపెడతానని పవన్ చెప్పారు.