విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా ఆ కేసును సుమోటోగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో అదే కేసుకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి.
ఓ ప్రముఖ తెలుగు పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం.. దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడంతోనే సరిపెట్టలేదని.. డిసెంబరు 26వ తేదిన అర్థరాత్రి సమయాన దుర్గమ్మ రూపాన్ని తొలిగించి.. కాళీకాదేవి రూపంలో అలంకరించారని తెలిపారు.
అలాగే మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించారని కూడా తెలుస్తోంది. ఈ తంతుని ఆలయానికి బాగా పరిచయమున్న పూజారులే నిర్వహించారని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పుడే సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలించినట్లు సమాచారం.
గతంలో ఇదే కేసుకు సంబంధించి దర్యాప్తుకి ఆదేశించిన ప్రభుత్వం, ఆలయ ఈవో సూర్యకుమారిని కూడా సస్పెండ్ చేసింది. అలాగే ఆలయ ప్రముఖుడు ఒకాయన రాత్రి పూజలో భాగంగా అమ్మవారిని అలంకరించినట్లు కూడా ఒప్పుకోవడంతో అనుమానాలు పెరిగాయి.
ఇటీవలే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి వివరాలు సేకరించారని... వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా.. భక్తులు సెంటిమెంట్‌ను, ఆచారాలను మంటగలిపిన దుష్టులెవరో తెలియాలని.. వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మాత్రం పలు భక్తసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి