తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సంచలనం నమోదు చేసిన అయేషా మీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారించిన సిట్ సరికొత్త కథతో వచ్చింది. విజయవాడ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ కూడా ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకి తెలిపింది. కేసు నడుస్తున్న సమయంలోనే ఈ పని జరిగి ఉండవచ్చని కూడా తెలియజేసింది. గతంలో ఇదే కేసుకు సంబంధించిన నివేదికను సమర్పిస్తున్న సమయంలో అయేషా మీరా తరఫున వాదిస్తున్న న్యాయవాదులు ఓ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసం అయ్యి ఉండవచ్చని తమకు తోస్తుందని.. విచారణ జరిపించమని కోర్టును కోరారు.
కోర్టు వారి అభ్యర్థన మేరకు విచారణ జరపమని సిట్ సభ్యులను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించిన సిట్ సభ్యులు ఈ రోజు కోర్టు ముందుకు వచ్చి.. రికార్డులు ధ్వంసం అయ్యాయన్న సంగతి వాస్తవమేనని తెలిపారు. అయితే వారు ఆ మాట అనడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆ రికార్డులు ధ్వంసం అవ్వడం వెనుక జరిగిన కథేమిటో బహిర్గతం చేయాలని.. 4 వారాల్లో ఇందుకు సంబంధించిన రిపోర్టు అందజేయాలని సిట్ సభ్యులను ఆదేశించింది.
2007 డిసెంబర్ 27 తేదిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా విజయవాడలోని హాస్టల్లో దారుణ హత్యకు గురైంది. హాస్టల్ బాత్ రూమ్ వద్ద రక్తసిక్తమైన ఆమె దేహాన్ని చూసిన మిగతా విద్యార్థినులు, వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయేషా దేహం పక్కనే పోలీసులకు ఓ ఉత్తరం కనిపించింది. తన ప్రేమను తిరస్కరించడం వల్లే అయేషాను హత్య చేసి చంపినట్లు హంతకుడు ఆ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఇదే కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్లు శిక్ష కూడా అనుభవించిన సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ హత్యకేసులో పలువురు రాజకీయ నాయకుల హస్తం ఉందని అనేక మీడియా సంస్థలు ఆ తర్వాత అనుమానం వ్యక్తం చేశాయి.