జనసేన పార్టీలో మళ్లీ కొత్త నాయకులు చేరారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన కీలక నేతల్లో కొందరు జనసేనలో చేరడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఒకప్పటి టీడీపీ నేత సుందరపు విజయ్ కుమార్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో ఆయన యలమంచిలి నుండి టీడీపీ టికెట్ పై పోటీ చేయాలని భావించి విఫలమయ్యారు. అలాగే మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు దాడి లక్ష్మీసత్యనారాయణ సతీమణి హెన్నా కూడా జనసేనలో చేరారు. అదేవిధంగా గాజువాక మింది ప్రాంతానికి చెందిన ఈటి రంగారావు, యంగ్ ఇండియా ట్రస్టు స్థాపకులు పి.వెంకట సురేశ్ మొదలైన వారు జనసేనలో చేరారు.
అలాగే వైసీపీ మహిళా విభాగం ప్రతినిధి పసుపులేటి ఉషాకిరణ్ కూడా జనసేనలో చేరుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అలాగే విశాఖకు చెందిన ప్రముఖ న్యాయవాది చంద్రమౌళి కూడా జనసేన పార్టీలో చేరారు. ఇంకా.. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి విల్లా శ్రీనివాసరావు కూడా జనసేన పార్టీలో చేరారు. గతంలో ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి విరివిగా పనిచేశారు.
ఈ రోజే శ్రీకాకుళంలో తుఫాను బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి కూడా పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. కాగా.. ఈ రోజు శ్రీకాకుళంలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ జిల్లా ప్రజలకు వరాలు కురిపించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని తెలిపారు. అలాగే మళ్లీ పంట చేతికొచ్చే వరకు పూర్తిస్థాయి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని.. పదేళ్ల పాటు అదే స్థాయి ఆదాయాన్ని రైతులకు అందించే ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు.