Nellore Urban MLA Anil Kumar Yadav: తనని కోస్తే.. తన రక్తంలోనూ జగన్ ఉంటాడు.. అనిల్ సంచలన వ్యాఖ్యలు

Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2023, 04:54 AM IST
Nellore Urban MLA Anil Kumar Yadav: తనని కోస్తే.. తన రక్తంలోనూ జగన్ ఉంటాడు.. అనిల్ సంచలన వ్యాఖ్యలు

Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు. తనని కోస్తే తన రక్తంలో కూడా సీఎం జగన్ ఉంటాడని, ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని కుతంత్రాలు చేసినా.. వైసీపీ నుండి తనను ఎవ్వరూ దూరం చేయలేరు అని అన్నారు. నెల్లూరు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబం అని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 

నియోజకవర్గం నలుమూలలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 100 మందికిపైగా ప్రజలకు ప్రతీ నెల 2000 రూపాయలు తన సొంత డబ్బుల్లోంచి ఇస్తున్నామని చెప్పిన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్... 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుండి మూడవసారి కూడా తానే బరిలో ఉంటానని.. అలాగే తానే గెలిచి మరోసారి అసెంబ్లీకి వెళ్తానని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎవరొస్తారో రండి చూసుకుందాం అంటూ తన రాజకీయ ప్రత్యర్థులకు అనిల్ కుమార్ సవాల్ విసిరారు. 

నెల్లూరు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు ఉంటాయని ధీమా వ్యక్తంచేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్... తన రాజకీయ ప్రత్యర్థులైన బాబాయ్ రూప్ కుమార్, నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ లను ఉద్దేశించి పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు తన వద్ద పనులు చేయించుకున్న కొంతమంది.. ఇపుడు తనకు దూరం జరిగి అన్ని తామే చేశామని సంకలు గుద్దుకుంటున్నారని వారిని ఎద్దేవా చేశారు. తన రాజకీయ భవిష్యత్తును ఎవ్వరూ అంతం చేయలేరని చెబుతూ తన అనుచరులు, కార్యకర్తల్లో జోష్ ని నింపే ప్రయత్నం చేశారు. 

ఏదేమైనా తరచుగా నెల్లూరు వేదికగా.. మరీ ముఖ్యంగా నెల్లూరు అర్బన్ నియోజకవర్గం వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, నేతలు, అనుచరులపై పరస్పర దాడులు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు తమదే.. నెల్లూరు నుంచి గెలుపు కూడా తమదే అని చెప్పడానికి నేతలు ఎంచుకుంటున్న పంథా అక్కడి స్థానిక నేతలు, కార్యకర్తలను ఒక్కోసారి అయోమయంలో పడేసే పరిస్థితి నెలకొంటోంది. పార్టీల మధ్య వైరం ఒకవైపు.. పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్యపోరు మరోవైపు.. వెరసి నెల్లూరు రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. నెల్లూరులో వైసీపీ నేతలు చేస్తోన్న హడావుడి, సొంత పార్టీ నేతలపైనే పరుష పదజాలం ఉపయోగించి చేస్తోన్న ప్రసంగాలపై సీఎం వైఎస్ జగన్ ఏమంటారో వేచిచూడాల్సిందే మరి. 

Trending News