తూ.గో: కాపు జేఏసీ నేతలతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం రహస్య సమావేశాన్ని నిర్వహించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పాటు, విశాఖ, శ్రీకాకుళం, విజయంనగరానికి చెందిన కాపు నేతలు పాల్గొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకరాదని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమకు రిజర్వేషన్లను కల్పించేందుకు ఏవరైతే చిత్తశుద్ధితో ముందుకు వస్తారో వారికే 2019 ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన అధికార పార్టీ టీడీపీ ..ఇప్పటి వరకు దీన్ని అమలు చేయకపోవడం. అలాగే ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యనిస్తున్న తరుణంలో ఈ భేటీ నిర్వహించడం గమనార్హం. తాజా పరిణామాలతో.. వచ్చే ఎన్నికల్లో కాపులు ఎవరి పక్షాన నిలబడతారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.