అనంతపురం: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలకబూనారు. అవిశ్వాసతీర్మానం పరిణామాలే ఇందుకు కారణంమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు ఆయన అనంతపురంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావడం లేదని సంచన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్రంలో రాజకీయాల తీరు బాగా లేవన్న జేసీ..పార్లమెంట్లో మాట్లాడేందుకు తనకంటే సమర్థులైన ఎంపీలు చాలామందే ఉన్నారని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇద్దరికి లేదా ముగ్గురికి మాత్రమే మాట్లాడే అవకాశం వస్తుందన్నారు. టీడీపీలో అనుభవం , ఇంగ్లిష్‌పై ప్రావీణ్యం ఉన్నవారే మట్లాడతారని జేసీ వ్యాఖ్యానించారు.
విప్ జారీ చేస్తే వెళ్లాలా..
అవిశ్వాస తీర్మానం సమయంలో సమావేశాలకు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం విప్ జారీ చేసింది కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ విప్ జారీ చేసినంత మాత్రాన ఏమీకాదన్నారు. జేసీ వ్యాఖ్యలను బట్టి పార్టీ అధిష్టానంపై అలకబూనినట్లు స్పష్టంగా తెలుస్తోంది..ఈ నేపథ్యంలో ఆయనకు నచ్చజెప్పి ఢిల్లీకి పంపేందుకు టీడీపీ అధిష్టానం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
కారణం ఇదేనా ..
వాస్తవానికి అవిశ్వాస తీర్మానం సమయంలో జేసీకి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిసింది. తనకంటే జూనియర్ అయిన కేశినేని చేత అవిశ్వాస తీర్మానం నోటిసు ఇప్పించారు. అలాగే అవిశ్వాస తీర్మానం సమయంలో గల్లాజయదేవ్ లాంటి జూనియర్లకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. సీనియర్ అయిన తననకు లెక్కచేయకపోవడాన్ని జేసీ జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.