Chandrababu Naidu Case: ఎపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని బీజేపికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఉన్న పురందేశ్వరి వెనకేసుకురావడం చూస్తోంటే.. ఆమె భారతీయ జనతా పార్టీలో ఉన్నారో లేక బావ జనతా పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని పురందేశ్వరిని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడిన దాఖలాలు లేకుండా 2018 లోలే ఆ ఫైల్స్ అన్నీ మాయం చేశారని.. కానీ ఆర్థిక శాఖలో షాడో ఫైల్స్ అంటూ కొన్ని ఉంటాయనే విషయం మర్చిపోయారని రోజా వ్యాఖ్యానించారు. మనం ఏంచేసినా పైనుంచి దేవుడు చూస్తూనే ఉంటాడని.. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అలాగే పట్టుబడితే ఆయన తప్పు చేయలేదని.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఖండిస్తున్నాను అంటూ పురందేశ్వరి వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం అని మంత్రి రోజా ప్రశ్నించారు.
చంద్రబాబు అవినీతి గురించి తెలియాలంటే..
చంద్రబాబు ఏమేం చేశాడో తెలియాలంటే నేరుగా ఢిల్లీ వెళ్తే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లి తాము ఏ తప్పు చేయలేదని.. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని.. ఆదాయానికి మించి ఆస్తులు లేవని చెప్పాలని.. అవసరమైతే సీబీఐ, ఈడి చేత విచారణకు ఆదేశించినా పర్వాలేదు అని రాతపూర్వకంగా ఓ లేఖ ఇచ్చి వచ్చిన తరువాతే తాను ఏ తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు మాట్లాడాలి అని మంత్రి రోజా సవాల్ విసిరారు. ఇవన్నీ చేయకుండా తాము నిప్పులం అని చెప్పుకుంటే ఎలా అంటూ చంద్రబాబు అండ్ కో కు మంత్రి రోజా చురకలంటించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళాడు. దీంతో పురంధేశ్వరి ఏం మాట్లాడుతున్నారో ఆమెకే తెలీటం లేదు. గతంలో చంద్రబాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధరేశ్వరి ఏమి మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. తన తండ్రి ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పొడిచాడు అనే విషయాన్ని చెప్పడం కోసం ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు చివరి రోజుల్లో మాట్లాడిన వీడియోలను ఇదే పురందేశ్వరి సీడీలు వేయించి మరీ ఎన్టీఆర్ జయంతి నాడు, ఎన్టీఆర్ వర్ధంతి నాడు పంచిపెట్టే వారని మంత్రి రోజా గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుని అంతగా విమర్శించిన పురందేశ్వరికి ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ ఇవాళ చంద్రబాబు అరెస్టు అయితే భారతీయ జనతా పార్టీ తరపున పురంధరేశ్వరి ఖండిస్తుందంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో జనమే అర్థం చేసుకోవాలన్నారు.
అక్రమాలకు పాల్పడిన డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేస్తుంది. అలాంటి ఈడిని నడిపించే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏపీ అధ్యక్షురాలి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడిని వెనకేసుకు రావడం అంటే కేంద్రం దొంగలను వెనకేసుకొచ్చినట్టే అనుకోవాల్సి వస్తుంది అని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు వెలిశాయని.. తమ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాకా ఆడపడుచుల పుస్తెలు తెగకూడదనే సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులన్నింటిని తొలగించి కేవలం ప్రభుత్వ దుకాణాలను మాత్రమే ఉండేలా చేశారని.. అలాంటప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోంది అని పురందేశ్వరి విమర్శించడంలో అర్థమే లేదని మంత్రి రోజా పురందేశ్వరి ఆరోపణలు కొట్టిపారేశారు.
తమ తండ్రి ఎన్టీఆర్ కు అల్లుడైన చంద్రబాబు నాయుడు ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించిన రోజు అది తప్పని చెప్పటానికి నోరు రాని పురంధరేశ్వరి, భువనేశ్వరికి, బాలకృష్ణలకు ఇప్పుడు మాట్లాడటానికి నోరెలా వస్తుందో అర్థం కావడం లేదు అని మంత్రి రోజా విస్మయం వ్యక్తంచేశారు. ఇవాళ పురందేశ్వరికైనా, భువనేశ్వరికైనా లేదా బాలకృష్ణకైనా... వాళ్లు ఇవాళ ఈ స్థాయిలో ఉండి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అంటే అది కేవలం వారికి ఎన్టీఆర్ పెట్టిన బిక్షేనని.. అలాంటి ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడే వారి గురించి మాట్లాడటమే వేస్ట్ అంటూ మంత్రి రోజా తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.