ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. మరో ఎన్నికల హామీని నెరవేర్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ కలను సాకారం చేయనున్నారు. ఇవాళ ఆయన జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల మధ్యలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు ఓ పెద్ద మనిషి కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు ఏళ్ల వరకు ఆయన ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు డ్రామా మొదలు పెట్టారన్నారు. కాబట్టి .. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే .. ఆరు నెలలకు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.
25వేల మందికి ఉపాధి
కడప ఉక్కు పరిశ్రమ ద్వారా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఉపయోగం ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఉక్కు పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా , పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.