AP Politics 2024: ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్ధుల ప్రకటనతో అసంతృప్తులతో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాల్లో అసంతృప్తి సహజంగానే కన్పిస్తోంది. అదే సమయంలో నేతల వ్యాఖ్యలు కొందరిని ఇబ్బంది పెడుతున్నాయి. జనసేనాని చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆ పార్టీ సామాజికవర్గంపై పడుతోంది.
ఏపీలో కూటమిగా ఏర్పడిన జనసేన-తెలుగుదేశం ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో జెండా సభను ఏర్పాటు చేశాయి. ఈ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు ఎలాంటి అలజడి రేపలేదు కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో అలజడికి కారణమయ్యాయి. తనను ప్రశ్నించేవారు తనతో ఉండవద్దని, తనకెవరూ సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడంపై కాపు సామాజికవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
అప్పటికే 24 సీట్లు దక్కించుకోవడంపై అసంతృప్తితో ఉన్న ఆ సామాజికవర్గంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలామందికి మింగుడుపడటం లేదు. పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని, బూత్ స్థాయి నిర్మాణం లేదని అలాంటప్పుడు టీడీపీతో ఎలా పోటీ పడగలమని సమర్ధించుకోవడంపై మండిపడుతున్నారు. పార్టీని పటిష్టం చేయాల్సిన నాయకుడు ఆ పని చేయకుండా తిరిగి అదే కారణంతో మరో పార్టీతో రాజీ పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తాడేపల్లిగూడెం సభ తరువాత అటు చేగొండి హరిరామజోగయ్య, ఇటు ముద్రగడ పద్మనాభంలు పవన్ కళ్యాణ్‌కు రాం రాం చెబుతూ రాసిన బహిరంగ లేఖలు సంచలనం రేపాయి. అటు క్షేత్రస్థాయిలో కూడా పవన్ వ్యాఖ్యలు కాపు సామాజికవర్గంలో చీలిక తెచ్చిందనే చెప్పాలి. అప్పటివరకూ కాపు ఓటింగ్ 70-80 శాతం జనసేనకు దక్కుతుందనే అంచనాలుంటే..పవన్ వ్యాఖ్యలు, 24 సీట్ల తరువాత ఓటింగ్‌లో 15-20 శాతం తగ్గిందని తెలుస్తోంది. ఎన్నో అంచనాలతో పార్టీలో చేరిన చాలామందికి ఈ వ్యాఖ్యలు నచ్చడం లేదు.
కొందరైతే జనసేనకు కేటాయించిన సీట్లలో గెలిపించుకుని మిగిలిన నియోజకవర్గాల్లో నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. ఎందుకంటే తనకు నచ్చినట్టు తాను చేస్తానని నాయకుడు చెబుతుంటే..కార్యకర్తలు, ఆ పార్టీ ఓటరు కూడా తనకు నచ్చింది తాను చేస్తానని అనుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తాడేపల్లిగూడెం సభ తరువాత కాపు సామాజికవర్గంలో చీలిక మాత్రం వచ్చిందని తెలుస్తోంది.
ముఖ్యంగా ఇప్పటి వరకూ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ పార్టీకు రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీల చేరిపోవడం కీలక పరిణామం. చేగొండి సూర్య ప్రకాష్ చేరిక కారణంగా ఆ సామాజికవర్గంలో చీలిక లేకపోవచ్చు గానీ సగటు కాపు ఓటరు అభిప్రాయం మాత్రం మారిందనే చెప్పాలి.
Also read: TSPSC-RIMC: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. టీఎస్‌పీఎస్సీ- ఆర్‌ఐఎంసీ నోటిఫికేషన్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook