వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి (68) కన్నుమూశారు. తొలుత ఆయన గుండెపోటుతో మృతి చెందారనే వార్త వచ్చింది. ఆయన పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వివేకనందరెడ్డి మృతిపై ఆయన బంధువుల నుంచి అనుమానాలు వ్యక్తమవడంతో ఆయన పీఏ కృష్ణారెడ్డి పులివెందుల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వివేకనందరెడ్డి బాత్ రూంలో పడి మరణించారని... ఆ సమయంలో ఆయన తల, చేతిక బలమైన గాయాలు తగిలి రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి గా పోలీసులు కేసు నమోదు చేశారు.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా తమ పెద్దనాన్న వివేకానందరెడ్డి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందా లేదా అనేది పోలీసులు తేల్చాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఇది యాక్సిడెంటల్ గా జరిగిన పరిణామమా లేదా ఇందులో కుట్ర ఏమైన దాగి ఉందా అనేది పోర్టుమార్టం రిపోర్టుతో తేలనుంది.