ఏపీ ప్రభుత్వానికి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్న మాటలు వివాదాస్పదంగా మారాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆశాకిరణమైన రైల్వే జోన్‌ను ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ఈ రోజు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
విశాఖకు రైల్వేజోన్ ఇచ్చే విషయంలో.. ప్రధానంగా రైల్వే బోర్డు కూడా తన వ్యతిరేకతను కనబరుస్తుందని హోంశాఖ తెలపడం గమనార్హం. ఈ రోజు హోంశాఖ, ఏపీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలు తెరమీదికొచ్చాయి. ఏపీలో రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు కేంద్రం విడుదల చేసిన నిధులు కేవలం రూ.1500 కోట్లేనని హోంశాఖ అంగీకరించింది. మరో రూ.1000 కోట్లు అందించే అవకాశం ఉందని తెలిపింది.