ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. అక్టోబర్ 20 నాటికి ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడే అవకాశాలున్నాయి.
ఇదిలావుంటే, మరోవైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై పడింది. దీని పర్యావసనంగా అక్టోబర్ 21, 22 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా నిత్యం ఏదో ఓ చోట భారీ వర్షాలు కురుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.