బెజవాడ దుర్గమ్మ ఆలయానికి మాంత్రికులను పిలిపించి క్షుద్రపూజలు చేయించినట్లు ఒక వార్త హల్చల్ చేస్తోంది. పాలకమండలి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేయడంతో స్థానికులలో కలకలం రేగుతోంది. గత నెల 26వ తేదిన అర్ధరాత్రి గడిచాక ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో ఈ పూజల తంతు నిర్వహించినట్లు కూడా పలు వార్తలు రావడంతో ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న స్థానిక అమ్మవారి భక్తులు, భక్తి సంఘాలు దోషులెవరో తెలియాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ విషయమై ఆలయ సీసీటీవి ఫుటేజిని పరిశీలించగా.. అర్థరాత్రి వేళ అర్చకులు, దేవాలయ సిబ్బంది కాకుండా అన్యులు, బయటవారు ఆలయంలోకి అడుగుపెట్టినట్లు తెలిసిందని సమాచారం. అయితే అందరూ అనుకున్నట్లు ఎలాంటి తాంత్రిక పూజలు కూడా ఆలయంలో చోటు చేసుకోలేదని.. ఇదంతా పుకారు మాత్రమే అని దేవాలయ ఈవో తెలిపారు. అయితే ప్రజల డిమాండ్ మేరకు పోలీసులు ఇంకా దర్యాప్తును కొనసాగిస్తున్నారని సమాచారం.