మహారాష్ట్ర : బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు స్పల్ప ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ధర్మాబాద్ కోర్టు అంగీకరించింది. ఇటీవలె తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ చంద్రబాబు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాబాద్ కోర్టు శుక్రవారం విచారణ జరిపించింది. దీనిపై ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో ఉండి పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున చంద్రబాబు నేరుగా కోర్టుకు హాజరుకాలేరని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూత్రా బలంగా వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం..చంద్రబాబుకు అనుకూల తీర్పును వెలువరించింది.
ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా మహారాష్ట్రలో నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టకు వ్యతిరేకంగా 2010లో టీడీపీ ఆందోళన చేసింది. ఈ ఆందోళనలో స్వయంగా చంద్రబాబు పాల్గొనడం..అది ఉద్రిక్తతకు దారి తీయడం జరిగింది. పోలీసుల విధులకు అడ్డుతగిలారనే కారణం, ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుతో సహా మరికొందరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా చంద్రబాబు తన తరఫున న్యాయవాదిని పంపిస్తే.. కోర్టు దీనికి అంగీకరించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబే స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ..ఈ నెల 15న జరిగే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై చంద్రబాబు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ జరిపిన కోర్టు ..ఈ మేరకు ఏపీ సీఎం వ్యక్తిగత హాజరును మినహాయిచింది.