2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నల్లారి మాట్లాడుతూ.. ఆరు నెలల ముందు రానున్న ఎన్నికల్లో ప్రధాని ఎవరని ప్రజలను అడిగితే మోదీయేనని చెప్పారని, కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు ప్రజల అభిప్రాయాన్ని మార్చేశాయని, ఆ క్రమంలోనే 2019 ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలే చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు.
ఏపీకి న్యాయం చేయడం కాంగ్రెస్ వల్లే సాధ్యమని.. ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తే ప్రత్యేక హోదా వస్తుందని భరోసా ఇచ్చారు. నాలుగేళ్లయినా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను బీజేపీ.. చిన్నరాష్ట్రాలు అన్న కారణంతో పట్టించుకోలేదని.. అదే ఒకటిగా ఉండి ఉంటే కావల్సినవన్నీ తెచ్చుకొనేవాళ్లమని అన్నారు. విభజనతో నష్టం జరుగుతుందని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటికి వచ్చానని చెప్పారు. హోదా సహా అనేక అంశాలకు తమ పోరాటమే కారణమన్నారు. తాము కేంద్రం వద్ద గట్టిగా మాట్లాడకుండా ఉండి ఉంటే పోలవరానికి జాతీయ హోదా, ప్రత్యేక హోదా హామీల వంటివి వచ్చేవి కావన్నారు.
తనకు, తన తండ్రికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిచ్చిందని, కాంగ్రెస్ పార్టీ వల్లే తనకు ఎన్నో పదవులు వచ్చాయని.. ముఖ్యమంత్రిగా, స్పీకర్‌గా, ప్రభుత్వ విప్‌గా ఇలా ఎన్నో పదవులు అలంకరించానని.. అందువల్లే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. హోదా విషయంలో ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుండి పలువురు కీలక నేతలు టచ్‌లో ఉన్నారన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.
రాబోయే అధికారం మాదే: కిరణ్ కుమార్ రెడ్డి