CM Chandrababu Naidu: వరదలకు దెబ్బతిన్న ప్రతి రైతునూ తమ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన ప్రజలను, రైతులను తమ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. వరదబాధిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి, నష్టం అంచనాలను పరిశీలించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితలను ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు కూడా తమ ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను సేకరించి అందజేయాలని సూచించారు.
వర్షాలు, వరదలపై శాసన సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ వరదల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మెట్ట ప్రాంతమైనా.. అక్కడ కూడా వరదల వల్ల కొంత నష్టం ఏర్పడిందని చెప్పారు. ప్రాథమిక అంచనాల మేరకు ఈ వరదల్లో 4,317 ఎకరాల్లో ఆకుమడులు పూర్తిగా దెబ్బతిన్నాయని.. 1.06 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారని పేర్కొన్నారు. అదంతా కూడా వరద నీటి ముంపునకు గురైందని.. 3,160 ఎకరాల్లో మొక్కజొన్న, 960 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఈ నష్టం అంచనాలన్నీ కేవలం ప్రాథమిక అంచనాలేనని.. క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఈ నష్టం ఇంకా పెరిగే సూచనలున్నాయన్నారు.
ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు కూడా ప్రజలకు సాయం చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత విపత్తుల వల్ల నష్ట పోయిన వారందరికీ కూడా సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరదల్లో ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పప్పు, లీటరు పామాయిల్, కేజీ బంగాళ దుంపలు , కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ఇళ్లలోకి వరద నీరు పూర్తిగా వచ్చి.. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వాళ్లందరికీ ఒక్కో కుటుంబానికి రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. తానే స్వయంగా వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని అనుకున్నానని.. కానీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో కుదరడం లేదని చెప్పారు చంద్రబాబు.
Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CM Chandrababu Naidu: ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం.. సీఎం చంద్రబాబు ప్రకటన