అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ మొత్తంలో నిధులు అందించి ఆయన గెలుపు కోసం సహాయపడ్డారని.. అందుకే ఏపీ సీఎం జగన్ ఇప్పుడు తిరిగి కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఆరోపించారు. కేసీఆర్ రుణం తీర్చుకోవడం కోసం ఏపీ భావితరాల భవిష్యత్తును తాకట్టు పెట్టడం ఎంతమేరకు సమంజసం అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారని చెబుతూ.. సభ్యత లేకుండా ఇలా అదుపుతప్పి మాట్లాడే ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదని అన్నారు. రాజశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డి లాంటి వాళ్లకే సమాధానం చెప్పిన తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ హుందాతనం లేకుండా ప్రవర్తించడం తెలియదని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెబుతూ.. జగన్ చెబుతున్నట్టుగా నీళ్ల కోసం తెలంగాణపై ఆధారపడితే ఏపీలో భావితరాలు నష్టపోతాయని అన్నారు.